ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరస అత్యాచార, హత్యాచార ఘటనలు ప్రకంపనలు సృష్టిస్తు్న్నాయి. గడిచిన రెండు నెలలు వ్యవధిలోనే మహిళలు, చిన్నారులపై పదుల సంఖ్యలో లైంగిక దాడులు జరిగాయి.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆడవారిపై అఘాయిత్యాలకు తెగబడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠిన శిక్షలు విధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్వయంగా ప్రకటన చేశారు.ఈ మేరకు కఠిన చర్యలు సైతం తీసుకుంటున్నారు. అయినప్పటికీ వారానికో ఘటన వెలుగు చూస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. అత్యాచారాలకు పాల్పడుతూ కామాంధులు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై మూడ్రోజుల క్రితం లైంగిక దాడి జరిగింది. ప్రస్తుతం చిన్నారి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే బాలిక ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల ఫిర్యాదులో పాఠశాల ఉపాధ్యాయుడిపై చిన్నారి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి వద్దకు చేరుకుని మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ పరామర్శించారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లైంగిక దాడి జరిగి మూడ్రోజులు గడిచినా ఇంతవరకూ కేసు నమోదు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి త్వరగా విచారణ చేపట్టాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. తమ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు. ఇటీవల ఏపీలో జరుగుతున్న వరస అత్యాచార ఘటనలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.