ఏపీలోని కూటమి ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, సభలో కొన్ని సాధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అసెంబ్లీ, శాసనమండలి ఎల్లుండికి వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు స్పందించారు. చీఫ్ విప్ లు, విప్ లను రేపు ఖరారు చేస్తామని చెప్పారు. ఇక, అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ గైర్హాజరు కావడంపైనా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని స్పష్టం చేశారు. సభలో ప్రజా సమస్యలపై చర్చించడం సభ్యుల బాధ్యత అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలని, చర్చల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.