ఏపీ పారిశ్రామిక రంగంలో నేడు కీలక ముందడుగు పడింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో బయో ఇంధన ప్రాజెక్టుకు సంబంధించి రిలయన్స్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారుల నడుమ అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఐదు నెలల్లోనే రిలయన్స్ ఎనర్జీ సంస్థ బయో ఇంధన ప్రాజెక్టులో రూ.65 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని అన్నారు. తాను ముంబాయిలో రిలయన్స్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, రిలయన్స్ ఎనర్జీ అధినేత అనంత్ అంబానీతో చర్చలు జరిపిన 30 రోజుల్లోనే ఒప్పందం కుదరడం చారిత్రాత్మక ఘట్టమని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు ఈ ఒప్పందం ఊతమిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు యూపీలోని బారాబంకీ బయోఫ్యూయల్ ప్రాజెక్టు వేగవంతంగా అమలైందని, రాష్ట్రంలో రిలయన్స్ ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టు ఆ రికార్డును బద్దలు కొడుతుందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 28న ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి బయో ఇంధన ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగుతుందని, రాబోయే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 500 ప్లాంట్ల ఏర్పాటు పూర్తిచేస్తారని చెప్పారు. తొలిదశ ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ 28 నాటికి (ఏడాదిలో) పూర్తిచేస్తామని రిలయన్స్ ఎనర్జీ ఏపీ ప్రతినిధి ప్రసాద్ తెలిపారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ... రిలయన్స్ బయో ఇంధన ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం తరపున అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.రిలయన్స్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఏపీ ప్రజలతోపాటు పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు అవుతున్నందుకు రిలయన్స్ అధినేతలు ముఖేశ్ అంబానీ, అనంత్ అంబానీలకు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.