మన దేశంలో రైల్వే వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది. అంతా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగుతూ ఉంటుంది. దేశంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేలు.. తక్కువ ధరకే ప్రయాణికులను, సరుకులను గమ్యస్థానాలకు చేర్చుతోంది. రైల్వే స్టేషన్ నుంచి మొదలుకొని రైలు పట్టాల వరకు అంతా ప్రభుత్వానిదే. ప్రైవేటుకు ఏ మాత్రం అవకాశం ఉండదు. కానీ ఓ వ్యక్తికి మాత్రం ఎక్స్‌ప్రెస్ రైలు ఉంది. అది కూడా ఆ వ్యక్తి ఏ బిజినెస్‌మెన్, రాజకీయ నాయకుడో కాదు.. సాధారణ రైతు. రైల్వే శాఖ అధికారులు చేసిన నిర్వాకం కారణంగా ఆ రైలుకు ఆ రైతు యజమాని అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.
పంజాబ్‌లోని లుథియానా జిల్లా కటానా గ్రామానికి చెందిన సంపూరణ్ సింగ్.. కొన్నేళ్లపాటు శతాబ్జి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఓనర్‌గా ఉన్నాడు. 2007లో లూథియానా- చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే అధికారులు చేపట్టిన భూసేకరణ చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా రైల్వే అధికారులు చేసిన తప్పు కారణంగా.. సంపూరణ్ సింగ్‌కు రైలుకు ఓనర్ అయ్యాడు. కటానా గ్రామంలో భూసేకరణ కోసం అక్కడ ఉన్న రైతులకు ఎకరానికి రూ.25 లక్షల చొప్పున రైల్వే అధికారులు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తమ సమీప గ్రామంలో ఎకరానికి రూ.71 లక్షలు చొప్పున రైల్వే అధికారులు ఇచ్చినట్లు గుర్తించిన సంపూరణ్ సింగ్.. తనకు అన్యాయం జరిగిందంటూ కోర్టును అశ్రయించారు.
వారికి రూ.71 లక్షలు ఇచ్చి.. తమకు మాత్రం రూ.25 లక్షలే ఇచ్చారని.. తమకు కూడా అంత మొత్తం ఇవ్వాలని సంపూరణ్ సింగ్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ ఎకరానికి పరిహారాన్ని రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచింది. అయినా సంపూరణ్ సింగ్ వెనక్కి తగ్గలేదు. చివరికి ఆ పరిహారం కాస్తా రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు.. అక్కడి నుంచి ఏకంగా రూ.1.47 కోట్లకు పెరిగింది. అయితే అంత మొత్తాన్ని 2015 లోగా సంపూరణ్ సింగ్‌కు చెల్లించాలని కోర్టు నార్తన్ రైల్వే అధికారులను ఆదేశించినప్పటికీ చెల్లించలేదు.
గడువు తీరిపోవడంతో తనకు రావాల్సిన పరిహారం కోసం సంపూరణ్ సింగ్ 2017లో మరోసారి కోర్టును ఆశ్రయించారు. 2017 వరకు రైల్వే శాఖ తనకు కేవలం రూ. 42 లక్షలు మాత్రమే చెల్లించిందని.. కోర్టు తీర్పు తనవైపే ఉన్నా డబ్బులు మాత్రం రైల్వే శాఖ చెల్లించడం లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి జస్పాల్ వర్మ.. సంచలనం తీర్పు వెలువరించారు. ఢిల్లీ-అమృత్‌సర్ మధ్య నడిచే స్వర్ణ్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు లుథియానాలోని స్టేషన్ మాస్టర్ ఆఫీస్‌ను కూడా జప్తు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుతో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు యజమాని అయిన ఏకైక వ్యక్తిగా సంపూరణ్ సింగ్ రికార్డుల్లోకి ఎక్కారు. అయితే డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును రైల్వే అధికారులు.. పై కోర్టులో అప్పీల్ చేశారు. దీంతో ఆ ఆదేశాలు రద్దయ్యాయి.