అసెంబ్లీ చీఫ్‌విప్‌గా వినుకొండ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మంత్రివర్గంలో ఇటు గుంటూరు నుంచి ఇద్దరికి, అటు బాపట్ల జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి. అయితే పల్నాడు జిల్లాకు ఒక్క మంత్రి పదవికి కూడా దక్కలేదు. ఈ పరిస్థితుల్లో పల్నాడు జిల్లాకు ఎట్టకేలకు కీలక పదవి దక్కింది. వినుకొండ నుంచి గోనుగుంట్ల వెంకట శివ సీతారామాంజనేయులు(జీవీ) మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షంలో ఐదేళ్లు పార్టీ అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ఈక్రమంలో ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. జీవీకి మంత్రి పదవి వస్తుందని జిల్లా పార్టీ వర్గాలు భావించాయి.
అయితే మంత్రివర్గ కూర్పులో కులాల సమీకరణల కారణంగా జీవీకి మంత్రి పదవి దక్కలేదు. ఈ పరిస్థితుల్లో చీఫ్‌విప్ పదవితో పార్టీ అధిష్ఠానం జీవీకి సముచిత స్థానం కల్పించింది. 2009, 2014లో జీవీ వినుకొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీలో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాకు టీడీపీ అధ్యక్షుడిగా దాదాపు పదేళ్లు బాధ్యతలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడి హోదాలో టీడీపీ సభ్యత్వ నమోదులో జీవీ పల్నాడు జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపి అధిష్ఠానం మన్ననలు పొందారు. ఇక ఆయన ఐదేళ్లు వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి అనేక పోరాటాలు చేశారు.