ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇళ్లస్థలాలు, ఇంటి నిర్మాణం విషయంలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అర్హులైన వారికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇచ్చి.. పక్కా ఇల్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పూర్తి చేసి.. డిసెంబరులో లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. కొప్పర్తి, నక్కపల్లిలో పారిశ్రామిక జోన్‌లు ఏర్పాటు కోసం పదివేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
వైసీపీ పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న చంద్రబాబు.. వాటిని గాడిన పెడుతున్నట్లు చెప్పారు. అందుకే అన్ని పనులు ఒకేరోజు చేస్తామని చెప్పడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా గతేడాది కంటే ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టామన్న చంద్రబాబు.. ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ మంచి బడ్జెట్ తెచ్చామన్నారు. కూటమి మీద నమ్మకంతో భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.
మరోవైపు గత ఐదేళ్ల పాలనలో ఏపీలో వినూత్నమైన రీతిలో దోపిడీ జరిగిందన్న సీఎం చంద్రబాబు నాయుడు.. వైసీపీ చేసిన తప్పులు, అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. అమరావతిని అడ్డుకున్నారని.. పోలవరాన్ని దెబ్బతీశారని.. స్కామ్‌ల కోసం స్కీమ్‌లు అమలు చేశారంటూ ఆరోపించారు. వైసీపీ విధానాలతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఏపీ పోగొట్టుకుందన్న చంద్రబాబు నాయుడు.. ఇసుక, మద్యం విధానాల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉచితంగా లభించే ఇసుకపై వ్యాపారం చేశారని.. మద్యంపై రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారని మండిపడ్డారు. చివరకు చెత్త పైనా పన్ను వేశారంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
మరోవైపు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విశాఖపట్నం రుషికొండలో. రూ.431 కోట్లతో ప్యాలెస్ నిర్మించారని చంద్రబాబు ఆరోపించారు. రుషికొండ ప్యాలెస్‌ను చూస్తే తనకే కళ్లు తిరిగాయని.. ప్రజాధనంతో ఇంత పెద్ద ప్యాలెస్ కడతారా అని అనిపించిందన్నారు. వైసీపీ అనుసరించిన విధానాల కారణంగా ఏపీ అప్పుల కుప్పగా మారిందన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు రూ.9,74,556 కోట్లు అప్పు ఉన్నట్లు తేలిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు రాక.. పారిశ్రామిక రంగం దెబ్బతినిందన్న చంద్రబాబు నాయుడు.. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. తన వద్ద డబ్బులు లేకపోయినా.. సరికొత్త ఆలోచనలు ఉన్నాయని.. వాటిద్వారా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు.