టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారు ఎవరైనా ఠక్కున గుర్తుపడతారు. వినూత్నమైన, విలక్షణమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలోనూ తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరేయించిన ఘనత జేసీ ప్రభాకర్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ పదవి స్వీకరించి అందులో కొనసాగుతున్నారు. అయితే తనను ఇప్పుడు తాడిపత్రి నుంచి పంపించేయాలంటూ జేసీ వేడుకుంటున్నారు. తాను చెప్చినట్టు వినాలని లేకుంటే ఇక్కడి నుంచి పంపించేయాలంటూ వేడుకుంటున్నారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. వీధుల్లోకి చెత్త వేయొద్దంటూ గత కొంతకాలంగా పట్టణవాసులను కోరుతున్నారు. దీనిపై అనేకసార్లు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే అధికారులు ఎంత చెప్పినా.. తాడిపత్రి జనం మాత్రం పద్ధతి మార్చుకోవటం లేదు. వీధుల్లోకి చెత్త పారబోస్తున్నారు. దీంతో దేశంలోనే శుభ్రమైన మున్సిపాలిటీలలో ఒకటిగా చెప్పుకునే తాడిపత్రిలోనూ రోడ్లపై చెత్త దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి పట్టణవాసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో వార్ని్ంగ్ ఇచ్చారు. రోడ్లపైకి చెత్త వేయకుండా మీరు మారతారా లేదంటే నన్ను ఊరు వదిలి వెళ్లిపొమ్మంటారా అంటూ హెచ్చరిస్తున్నారు. వీధుల్లో చెత్త వేయవద్ధంటే వేస్తున్నారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. చెత్త వేస్తే నీళ్లు, కరెంటు కట్ చేయిస్తానని హెచ్చరించారు.
"చెత్త వేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలా.. ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదు. చెత్తను వేస్తున్నారు. చెత్త వేసేవారికి నాలుగు ఆప్షన్లు ఇస్తున్నా. చెత్త వేస్తే నీళ్లు కట్ చేస్తా.. రెండో ఆప్షన్ కింద కరెంట్ కట్ చేస్తాం.. అప్పటికీ మారకుంటే చెత్తను మీ ఇంట్లోకి వేస్తాం. మీరు మారతారా లేకపోతే నన్ను ఊరు వదిలేయమంటారా. చేతులెత్తి అడుగుతున్నా.. మీరు నేను చెప్పినట్టు వింటారా.. లేకపోతే నన్ను ఊరి నుంచి పంపించేయండి" అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మరోవైపు రోడ్లపై ద్విచక్ర వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడంపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యావంతులు, చదువుకున్న వ్యక్తులు కూడా పారిశుద్ధ్యంపై ఇష్టానుసారం ప్రవరిస్తే ఎలా అని మండిపడ్డారు.