ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో తమ పార్టీ ప్రతినిధులు ఎవరూ పాల్గొనకూడదని పేర్కొంది. మహారాష్ట్రలో ఒకే విడతలో, జార్ఖండ్‌లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతినిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ మొత్తం పూర్తి కావడంతో చాలా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌తో సిద్ధంగా ఉన్నాయి. సాయంత్రం 6.30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆ తర్వాతే ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా.. ఇప్పుడు వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో తాము పాల్గొనడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. 288 అసెంబ్లీ నియోజవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నేడు పోలింగ్ ఒకే విడతలో నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట వరకు మహారాష్ట్రలో 45.53శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. చాలా మంది ఓటర్లు ఇంటి నుంచి బయటికి ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఓటింగ్ శాతం భారీగా తగ్గింది. ఇక మహారాష్ట్రలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. సినీ, క్రీడా, రాజకీయ సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్-జెనీలియా, సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ దంపతులు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్, నటి ట్వింకిల్ ఖన్నా, శ్రద్ధాకపూర్ సహా పలువురు పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేశారు. ముంబైలో ఉండే 113 ఏళ్ల కాంచన్‌బెన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యత అంటూ సూచించారు. మరోవైపు, జార్ఖండ్‌లో మాత్రం ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మధ్యాహ్నం వరకే జార్ఖండ్‌లో 61. 47 శాతం ఓటింగ్ పూర్తయింది.