మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఇక ఫలితాల కోసం అభ్యర్థులు, పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇక మహారాష్ట్ర అంటేనే కూటములు, కుటుంబ రాజకీయాలకు ప్రసిద్ధి కాగా.. తాజా ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలిపోయి.. పోటీ పడుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఎన్నికల్లో జనం ఎవరివైపు మద్దతుగా నిలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అది తెలియాలంటే శనివారం వరకు ఆగాల్సిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు.. వేర్వేరు పార్టీల నుంచి ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తూ.. ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. మొత్తం 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. నవంబర్ 23వ తేదీన కౌంటింగ్ చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగగా.. కాంగ్రెస్- ఉద్ధవ్ ఠాక్రే శివసేన-శరద్ పవార్ ఎన్సీపీలు మహా వికాస్ ఆఘాడీ కూటమిగా పోటీ చేస్తున్నాయి.
బారామతిలో పవార్‌ల పోరు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ ఎన్సీపీని చీల్చి.. వేరు కుంపటి పెట్టిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పోటీ చేస్తుండగా.. ప్రత్యర్థిగా శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ తరఫున యుగేంద్ర పవార్ పోటీ చేస్తున్నారు. సీనియర్ అయిన అజిత్ పవార్‌పై తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న యుగేంద్ర పవార్ ప్రత్యర్థిగా నిలవడం గమనార్హం. అయితే యుగేంద్ర పవార్‌కు అజిత్ పవార్ పెద్దనాన్న కావడం గమనార్హం. అజిత్ పవార్ తమ్ముడు శ్రీనివాస్ పవార్ కుమారుడే ఈ యుగేంద్ర పవార్. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్.. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీ చేయగా.. సుప్రియా సూలే విజయం సాధించారు. ఇక బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ ఏడుసార్లు పోటీ చేసి గెలవగా.. ఒకసారి బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
ఛత్రపతి శివాజీ శంభాజీనగర్
ఇక ఛత్రపతి శివాజీ శంభాజీనగర్ నుంచి భార్యాభర్తలు పోటీ చేస్తుండటం మహారాష్ట్ర ఎన్నికల్లో మరో విశేషం. ఇక ఈ నియోజకవర్గం నుంచి హర్ష్‌వర్ధన్ జాదవ్.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే శివసేన షిండే పార్టీ తరఫున ఆయన భార్య సంజనా జాదవ్ కూడా పోటీ చేస్తున్నారు. ఇక సంజనా జాదవ్ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రావ్ సాహెబ్ ధన్వే కుమార్తె కావడం గమనార్హం. సంజనా జాదవ్ సోదరుడు సంతోష్ ధన్వే.. బీజేపీ తరఫున జల్నాలోని భోకార్డాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
మహారాష్ట్ర బరిలో మాజీ ముఖ్యమంత్రుల కుమారులు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అమిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్‌లు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అమిత్ దేశ్‌ముఖ్ లాతూర్ సిటీ నుంచి పోటీ చేస్తుండగా.. లాతూర్ రూరల్ నియోజకవర్గం నుంచి ధీరజ్ దేశ్‌ముఖ్ బరిలో నిలిచారు. ఇదే విధంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే కుమారులు నితీష్ రాణే, నీలేష్ రాణే కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం గమనార్హం. కుడాల్ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీ తరఫున నితీష్ రాణే బరిలోకి దిగగా.. కంకావలి నియోజకవర్గం నుంచి నీలేష్ రాణే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.
ఠాక్రే కుటుంబం
ముంబైలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఠాక్రే కుటుంబం నుంచి పలువురు పోటీలో ఉన్నారు. వర్లీ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిత్య ఠాక్రే(ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు) మరోసారి శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆదిత్య ఠాక్రే తల్లి తరఫు బంధువు వరుణ్ సర్దేశాయ్ బాంద్రాలోని వండ్రే నియోజకవర్గం నుంచి శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక ఆదిత్య ఠాక్రే కజిన్ అమిత్ ఠాక్రే(మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు) ముంబైలోని మహిమ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో ఎంత మంది గెలిచారు.. ఏ కుటుంబంలో ఎవరిది పైచేయి అని తెలియాలంటే నవంబర్ 23వరకు ఆగాల్సిందే.