పని ప్రదేశంలో ఉద్యోగులను సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ఓ సంస్థ వినూత్న ఆలోచన చేసింది. తమ సంస్థలో పనిచేసే ఒంటరి ఉద్యోగులు డేట్‌కు వెళ్లే ఇన్సింటివ్‌లు ఇస్తామని ప్రకటించింది. చైనాకు చెందిన ఇన్‌స్టా360 అనే టెక్ కంపెనీ ఈ ఆఫర్ ఇవ్వడం విశేషం. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. షెంజాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఇన్‌స్టా360 ఈ ప్రకటన చేసింది. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో ఎవరినైనా పరిచయం చేసుకుని, దీని గురించి సంస్థ సోషల్ మీడియా వేదికలో పోస్ట్ పెడితే 66 యువాన్లు (సుమారు రూ. 770) అందజేస్తానని పేర్కొంది. సదరు ఉద్యోగి పరిచయమైన వ్యక్తితో మూడు నెలల పాటు సంబంధాన్ని కొనసాగించినట్లయితే.. వారి క్కొక్కరికి 1,000 యువాన్లు (సుమారు రూ. 11,650) రివార్డ్ ఇస్తామని ప్రకటించింది.
ఈ వినూత్న ఆలోచన వెనుకున్న అంతిమ లక్ష్యం ఉద్యోగులను సంతోషపెట్టడమేనని ఆ సంస్థ ప్రతినిదులు వెల్లడించినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ క్యాంపెయిన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 500 పోస్ట్‌లు చేశారని వెల్లడించారు. ఇప్పటి వరకూ పోస్ట్‌లు పెట్టినవారికి 10 వేల యువాన్లు సంస్థ చెల్లించినట్టు తెలిపారు. మూడు నెలల కిందటే ఇది మొదలైందని, ఇంకా డేటింగ్ బోనస్‌లు ఇవ్వలేదని సిబ్బంది ఒకరు చెప్పడం గమనార్హం. అయితే, దీనిపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది. నా కంపెనీ మా అమ్మ కంటే ఎక్కువ ఆసక్తి చూపుతోందని ఒకరు.. నగదు ప్రోత్సాహకాలు సరైన విధానమేనా అని ఇంకొకరు ప్రశ్నించారు. అయితే, నెటిజన్ల మాత్రం మీ కంపెనీ రిక్రూట్‌మెంట్ ప్లాన్‌లో ఉందా? అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ప్రభుత్వం దీనిని అనుసరించాలని ఇంకో వ్యక్తి పోస్ట్ పెట్టారు. అయితే, దీనిని అందరూ సమర్దించడం లేదు. ప్రేమను డబ్బుతో కొలవలేరని కొందరు పెదవి విరుస్తున్నారు.
అయితే, చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం విశేషం. చైనాలో వివాహాలు, జననాల రేటు దారుణంగా పడిపోయింది. ఇటీవల ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మూడు త్రైమాసికాల్లో చైనా వ్యాప్తంగా కేవలం 4.74 మిలియన్ల మంది మాత్రమే వివాహానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గతేడాది పోల్చితే ఇది 16.6 శాతం తక్కువ. ఇదే సమయానికి 2023లో 5.69 మిలియన్ల జంటలు పెళ్లిచేసుకున్నట్టు నమోదయ్యింది. అంతేకాదు, 2022తో పోల్చితే చైనా సంతానోత్పత్తి రేటు 6.39 శాతానికి పడిపోయింది. ఈ పరిణామం చైనాను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో పెళ్లిళ్లు చేసుకుని, ఇద్దరు ముగ్గురు పిల్లలను కనాలని యువతను చైతన్యం చేస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రోత్సాహకాలను కూడా ప్రకటిస్తోంది.