ప్రశ్నోత్తరాల సమయం అంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. కానీ, మంత్రి సభలో ఆవు కథ చెబుతున్నారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అప్పుల పై అన్ని పార్టీల తో కమిటీ వెయ్యండి. అప్పుడు.. ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుస్తామన్నారు. కూటమి నేతలు ఆరోపణలు చేయడం సమంజసం కాదు. వాస్తవాలు చెబితే అభ్యంతరం లేదు. మంత్రి కేశవ్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు ఏం చెప్తే అది చెవిలో పువ్వులు పెట్టుకుని వినాలా? అంటూ బొత్స మండిపడ్డారు.
శాసన మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయగా.. దానికి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. అటు శాసనసభలోనూ చంద్రబాబు సైతం వ్యక్తిగత గొప్పలతో సభలో కాలయాపన చేశారు. ఏపీ అప్పులు 6.46 లక్షల కోట్లు అని ప్రకటించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 2024 జూన్ నాటికి 4,91,734 కోట్లు బడ్జెట్ అప్పులు ఉన్నాయని, కార్పొరేషన్ ల ద్వారా 1,54,797 కోట్లు అప్పులయ్యాయని అన్నారాయన. అదే టైంలో.. గత ప్రభుత్వం 9 లక్షల 74 వేల కోట్లు చేసిందంటూ తీవ్ర ఆరోపణలకు దిగారు.