భూమధ్య రేఖకు ఆనుకుని హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఈ నెల 25వ తేదీకల్లా దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనుంది. తదుపరి ఈ నెల 27వ తేదీకల్లా తమిళనాడు, శ్రీలంక తీరాల దిశగా రానుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే వాయుగుండం తుఫాన్‌గా బలపడుతుందని పలు మోడళ్లు అంచనా వేస్తున్నాయి. తుఫాన్‌గా తీరం దాటుతుందా?, లేదా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తీరం వైపు వస్తుందా? అన్న దానిపై స్పష్టత రాలేదు. అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం బలపడి తమిళనాడు తీరం దిశగా రానున్నందున ఈనెల 27 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరగనున్నాయి. 27న నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. 28న అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో, 29న అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. కాగా వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు కోసే రైతులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.