భారత రాజ్యాంగంలో లౌకికవాదం, సామ్యవాదం భాగాలేనని సోమవారం సుప్రీంకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చిన సెక్యులర్(లౌకికవాదం), సోషలిస్ట్ (సామ్యవాద) పదాలను తొలగించాలని దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ కీలక తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తాజాగా చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలోనే బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, బలరాం సింగ్, అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.
రాజ్యాంగ పీఠికలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను జోడిస్తూ 1976లో చేసిన 42వ సవరణను సవాలు చేస్తూ పిటిషనర్లు సుబ్రమణ్య స్వామి, బలరాం సింగ్, అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ రెండు పదాలను రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలని కోరారు. అంతేకాకుండా ఈ 42వ రాజ్యాంగ సవరణపై అప్పటి పార్లమెంట్‌లో చర్చ జరగలేదని వారు వాదించారు. 1975 నుంచి 1977 మధ్య ఎమర్జెన్సీ సమయంలో చేసిన ఈ సవరణకు సంబంధించిన చట్టబద్ధతను వారు ప్రశ్నించారు. ఈ పిటిషన్లపై వివిధ పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. నవంబర్ 22వ తేదీన తీర్పు రిజర్వ్ చేసి.. తాజాగా వాటిని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
ఈ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలకు వివిధ వివరణలు ఉన్నాయని.. వాటిని వేర్వేరుగా అన్వయించుకుంటున్నారని గతంలో జరిగిన విచారణల సమయంలో ధర్మాసనం అభిప్రాయపడింది. సోషలిజం అంటే.. అందరికీ సమాన అవకాశాలు ఉండాలని.. సమానత్వం అనే అంశాన్ని ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొంది. దీన్ని మరో రకంగా చూడకూడదని.. అప్పుడు వేరే అర్థం కూడా వస్తుందని హితవు పలికింది. ఇక సెక్యులర్ అనే పదం విషయంలోనూ అంతే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో సెక్యులరిజం అనేది ఒక అంతర్భాగమని సీజేఐ సంజీవ్ ఖన్నా తేల్చి చెప్పారు. గతంలో ఎస్‌ఆర్ బొమ్మై కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే చెప్పిందని గత తీర్పును గుర్తు చేశారు.
ఇక సోషలిస్ట్ అనే పదానికి వివిధ దేశాల్లో వివిధ అర్థాలు ఉండొచ్చని.. కానీ మన దేశంలో మాత్రం సంక్షేమ రాజ్యం అనే కోణంలోనే చూస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. సోషలిజం అనే పదం రాజ్యాంగంలో ఉన్నా.. ప్రైవేటు రంగాన్ని మన దేశంలో ఎప్పుడూ అడ్డుకోలేదని తేల్చి చెప్పింది. సోషలిజం అందించిన సంక్షేమ రాజ్య భావనతో దేశ ప్రజలకు సమాన అవకాశాలను కల్పిస్తున్నామని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఇక అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలు అన్నీ చట్టపరంగా చెల్లవని తాము చెప్పలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా 42వ రాజ్యాంగ సవరణ చేయడానికి ముందు న్యాయపరంగా చాలా కసరత్తు జరిగిందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa