ఉపాధ్యాయులను కుదించేందుకు గత ప్రభుత్వం తెచ్చిన 117 జీవోను రద్దుచేయాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. గత వైసీపీ పాలనలో విలీనం చేసిన మూడు, నాలుగు తరగతులను ప్రాథమిక పాఠశాలలకు పంపే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఒంగోలు స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవాల మహాసభ రెండోరోజైన శనివారం కొనసాగింది. ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో సమాంతర మీడియంలను నిర్వహించి ఉపాధ్యాయులను సరిపడా ఏర్పాటు చేయాలన్నారు. టీచర్లకు రావాల్సిన ఆర్థిక బకాయిలను విడుదల చేయడంతోపాటు 12వ పీఆర్సీ కమిటీని వేసి వెంటనే అమలు చేయాలన్నారు.
పీఆర్సీలో జాప్యం జరిగిందున ప్రభుత్వం 29 శాతం ఐఆర్‌ను ప్రకటించాలన్నారు. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఒకటి నుంచి ఐదు తరగతులు నిర్వహించాలని, ప్రతి గ్రామానికి ఒక మోడల్ స్కూలు ఏర్పాటు చేసి ఐదు పోస్టులు ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజీ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యా విధానం మెరుగుపడే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలన్నారు. ఎన్నికల అధికారిగా, పరిశీలకులుగా వచ్చిన రాష్ట్ర కార్యదర్శి నవ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యమం ఆవశ్యకతను, యూటీఎఫ్ సాధించిన విజయాలను వివరించారు. ఈ మహాసభల్లో 40 మండలాలకు చెందిన కౌన్సిలర్లు పాల్గొన్నారు.