రాజస్థాన్‌లో మహారాణా ప్రతాప్ వారసుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. కొత్తరాజు పట్టాభిషేకం ఆ రాజవంశంలో చిచ్చురేపింది. మేవార్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులను ఉదయ్‌పుర్ కోటలోకి అడుగుపెట్టకుండా దాయాదులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసి.. పలువురు గాయపడ్డారు. రాజపుత్ర వీరుడు, మేవార్ పాలకుడు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవార్, అరవింద్ సింగ్ మేవార్‌ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో మేవార్ మహారాజు మహేంద్రసింగ్ ఇటీవల కన్నుమూశారు. ఆయన మరణించిన 12 రోజలు తర్వాత మేవార్ తదుపరి పాలకుడిగా ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ సోమవారం పట్టాభిషిక్తుడయ్యారు.
చిత్తోర్‌గఢ్ కోటలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అనంతరం సంప్రదాయం ప్రకారం వారి కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. కానీ, ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రస్తుత ఉదయ్‌పుర్ రాజ కుటుంబానికి చెందిన ట్రస్ట్ ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న అరవింద్ సింగ్. కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్యాలెస్, ఏకలింగనాథ్ ఆలయం ఈయన నియంత్రణలోనే ఉండటంతో.. మహారాజు విశ్వరాజ్ సింగ్‌ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు వెలువరించారు.
ఈ పరిణామాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా భారీ భద్రత ఏర్పాటుచేశారు. ఈక్రమంలోనే సోమవారం రాత్రి నూతన మహారాజు విశ్వరాజ్ సింగ్, తన మద్దతుదారులతో కలిసి కోట వద్దకు చేరుకున్నారు. కానీ, అరవింద్ సింగ్ కుమారుడు లక్ష్య రాజ్ సింగ్, ఆయన వర్గం వీరిని లోనికి రాకుండా అడ్డుకుంది. దీంతో విశ్వరాజ్ మద్దతుదారులు బారికేడ్లను దాటుకుని బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాళ్ల దాడికి ప్రయత్నించగా.. పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
ఇరు వర్గాల మధ్య ఘర్షణలతో మహారాజా విశ్వరాజ్ సింగ్ ఐదు గంటల పాటు ప్యాలెస్ బయటే నిలిచిపోయారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ జోక్యం చేసుకోనున్నారు. గతేడాది రాజస్థాన్ ఎన్నికల్లో విశ్వరాజ్ రాజసమంద్ నుంచి ఎమ్మెల్యేగా నిలిచారు. ఆయన భార్య మహిమ కుమారి కూడా రాజసమంద్ ఎంపీ. ఈ ఘటనపై మహారాజా మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ‘నాకు మద్దతుగా నిలిచినందుకుకృతజ్ఞుడ్ని... ఒక వైపు ఆస్తులు ఉన్నాయి.. కానీ మనం ఆశీర్వాదాలు కోరుకునే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. సంప్రదాయాలు, సమాజ నిబంధనలకు సంబంధించినంత వరకు ఇది తప్పు’ అని ఆయన అన్నారు.
అయితే, 40 ఏళ్ల కిందట 1984లోనూ ఇలాగే జరగడం గమనార్హం. మేవార్ రాజు మహారాణా భగవత్ సింగ్.. తన పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్‌ను తొలగించి చిన్న కొడుకు అరవింద్ సింగ్‌ను ట్రస్ట్‌లకు డైరెక్టర్‌గా నియమించారు. అప్పటి నుంచే దాయాదుల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది.