అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోళ్లలో జగన్ రెడ్డికి 200 మిలియన్ డాలర్ల లంచం ముట్టిందని ఆనం ఆరోపించారు. అవినీతిలో వైసీపీ అధినేతకు మించిన మరో వ్యక్తి లేడని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తేల్చిందని ఆయన చెప్పారు. జ్యూరీ ట్రైల్ బై డిమాండ్ ప్రకారం సంవత్సరంలో జగన్ రెడ్డి భాగోతం మొత్తం ఎఫ్‌బీఐ బట్టబయలు చేయనుందని అన్నారు.
ఈ కేసు నుంచి ఎవ్వరూ తప్పించుకునే అవకాశమే లేదని ఆనం చెప్పారు.జూన్, 2020లో 90 రోజుల్లో డిస్కంలతో పీపీఏ ఒప్పందం చేసుకోవాలని సెకీతో అగ్రిమెంట్ చేసుకుంటే.. 18 నెలలు అయినా జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చేసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కమిషన్‌లు ఇస్తామనడంతో అర్ధరాత్రులు సైతం ఫైళ్లు పరిగెత్తుకుంటూ అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరాయని ఆనం చెప్పారు. దీంతో ఏదో లొసుగుందని అర్థం చేసుకున్న బాలినేని జాగ్రత్తపడి సైడ్ అయిపోయారని ఆయన వెల్లడించారు.అనంతపూర్ సోలార్ పార్క్ చేసిన పీపీఏల్లో అన్ని రాష్ట్రాల కంటే ఏపీనే తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసిందని ఆయన చెప్పారు. ఇందులో ఎక్కడ తప్పు జరిగిందో ఎంపీ విజయ్ సాయిరెడ్డి చెప్పాలని ఆనం డిమాండ్ చేశారు. 6.4 గిగావాట్ల సోలార్ పవర్ కోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్ పిలవగా అదానీ, షిర్డిసాయి, టారెంట్ నాలుగు కంపెనీలు మాత్రమే వచ్చాయని అన్నారు. టెండర్ వేస్తామని టాటా కంపెనీ వస్తే లంచం ముట్టలేదని జగన్ రెడ్డి ససేమిరా అన్నారని ఆనం వెంకట రమణారెడ్డి ధ్వజమెత్తారు.