వారం, పది రోజుల్లో నూతన వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది. ముందుగా అర్హులైన సభ్యులతో కొత్త బోర్డును ఏర్పాటు చేస్తామని, అనంతరం సమర్థుడైన వ్యక్తిని చైర్మన్‌గా సభ్యులు ఎన్నుకొంటారని పేర్కొంటూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ఆస్తులు పరిరక్షించడంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించింది. పాలనా కార్యకలాపాలను కూడా విస్మరించింది. పైగా న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. దీనిపై దాఖలైన పెండిగ్ వ్యాజ్యాలలో హైకోర్టు సూచనల మేరకు చర్యలు తీసుకున్నాం. వక్ఫ్‌బోర్డును రద్దు చేశాం. గత ప్రభుత్వం తెచ్చిన జీవో నం.47కు ఉపసంహరించాం’’ అని ఆ ప్రకటనలో తెలిపింది.