కార్తిక మాసం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది. సోమవారంతో ఈ మాసం వెళ్లిపోతుంది. రేపటి (మంగళవారం) నుంచి మార్గ శిర మాసం. అంటే విష్ణువుకు ఇష్టమైన మాసం. ఈ మాసంలో తొలి రోజు.. పోలి పాడ్యమి. ఈ రోజు పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు. ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు స్నానమాచరించి.. నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. దీప దానం కూడా చేస్తారు. ఈ క్రమంలో సింహాచలం పుష్కరిణిలో పోలి పాడ్యమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
సోమవారం తెల్లవారుజామునుంచే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పుష్కరణిలో స్నానమాచరించి అరటి దవ్వలో దీపాలు వెలిగించి విడిచిపెడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు గజ ఈతగాళ్లు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో రద్దీగా మారంది. దీంతో సింహాచలం పుష్కరిణి మార్గం నుంచి వరాహ పుష్కరిణి వరకు వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా నిషేధించారు.