భారత్-చైనా సరిహద్దుల్లో తూర్పు లఢఖ్‌లో 2020లో డ్రాగన్ సైన్యం చేసిన చర్యల కారణంగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అప్పటి నుంచి సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న పరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు కమాండర్ స్థాయి, విదేశాంగ మంత్రుల స్థాయిలో పలు చర్చలు జరిగాయి. అయితే ఇటీవల భారత్, చైనాల మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో.. ఘర్షణాత్మక ప్రాంతంలో మోహరించిన సైన్యం వెనక్కి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సరిహద్దు నుంచి రెండు దేశాల సైన్యాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత్-చైనాల మధ్య ఉన్న సంబంధాలు, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిపై విదేశాంగమంత్రి జైశంకర్.. లోక్‌సభకు చెప్పారు.
భారత్-చైనా సరిహద్దు సమస్యకు న్యాయమైన, సరైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని తీసుకురావడానికి ద్వైపాక్షిక చర్చల ద్వారా చైనాతో సంప్రదింపులు జరపడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. 2020 ఏప్రిల్-మేనెలల్లో తూర్పు లఢఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా సైనికులను మోహరించారు. ఈ క్రమంలోనే సరిహద్దుల్లోని వివిధ పాయింట్ల వద్ద చైనా తమ దళాలను భారీగా మోహరించింది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో పెట్రోలింగ్‌కు అడ్డు కలిగించిందని జై శంకర్ తెలిపారు. ఎన్నో లాజిస్టిక్ సవాళ్లు, కొవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ భారత సైన్యం వేగంగా, సమర్థవంతంగా.. చైనా సైన్యాన్ని అడ్డుకుని.. వారిని ప్రతిఘటించిందని చెప్పారు. ఇక సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించి.. శాంతిని ఏర్పాటు చేసేందుకు దౌత్యచర్చలు అవసరమని జై శంకర్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే సరిహద్దు రక్షణ సహకారంపై రెండు దేశాలు ఒక అవగాహనకు రావడానికి 1991, 1993, 1996, 2003, 2005, 2012, 2013లో చేసుకున్న ఒప్పందాలను జైశంకర్ గుర్తు చేశారు. తాజాగా ఇటీవల జరిగిన డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌కు సంబంధించి జరిగిన ఒప్పందాన్ని ప్రస్తావించారు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా లోక్‌సభలో జై శంకర్ ఈ ప్రకటన చేశారు.