కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజనుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు ఆక్షేపించారు. ప్రభుత్వమే ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆగ్రహించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలోని ఇళ్లలో నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్ వాడినా బిల్లులు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు మీడియాతో మాట్లాడారు.దళిత, గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపాలనే మంచి ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నెలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు, వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే.. అంటే 2019, జూలై 25న, జీఓ జారీ చేశారు.
ఆ విద్యుత్ సబ్సిడీ మొత్తం ప్రభుత్వం భరిస్తుందని అందులో ప్రకటించారు. ఆ మేరకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు రూ.2,362 కోట్లు, 4,57,686 గిరిజన కుటుంబాలకు రూ.483 కోట్ల మేర ప్రయోజనం కల్పించారు. అంటే మొత్తంగా 19,86,603 కుటుంబాలకు రూ.2846 కోట్ల విలువైన విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేశారు.రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు వైయస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారన్న కక్షతో, కూటమి ప్రభుత్వం ఒక హేయమైన నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం మంగళం పాడింది. నెలకు 100 యూనిట్ల లోపు విద్యుత్ వాడినా సరే, బిల్లులు జారీ చేస్తోంది. బకాయిలు కూడా కట్టాలంటూ, వేలకు వేల బిల్లులు ఇస్తూ, కట్టకపోతే, నిర్దాక్షిణ్యంగా కనెక్షన్లు కట్ చేస్తున్నారు. మీటర్లు తొలగిస్తున్నారు. స్పష్టమైన ఉత్తర్వులు (జీఓ) జారీ చేయకుండా చీకటి ఆదేశాలతో విద్యుత్ సిబ్బందిని ఎస్సీ, ఎస్టీ కాలనీలకు పంపి, అర్థరాత్రి సమయంలో విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారు. ప్రశ్నించిన దళిత, గిరిజన కుటుంబాలను, మహిళలను విద్యుత్ అధికారులు మాటల్లో చెప్పలేని విధంగా దూషిస్తూ, హేళన చేస్తూ దౌర్జన్యకాండ ప్రదర్శించారు అని మండిపడ్డారు.