రాష్ట్రంలో ఎవరికీ వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని.. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారని అనిల్ అనే వ్యక్తిని టార్గెట్ చేశారంటూ వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అతన్ని బెదిరించి నంబర్ తీసుకుని 25 నిమిషాల్లోనే మొబైల్ ట్రాక్ చేశారని తెలిపారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం అనేదే లేదన్నట్టుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఎప్పటికీ అధికారం తమ చేతుల్లోనే పెట్టుకోవాలన్న దురహంకారంతో నియంత పాలన సాగిస్తున్నాయి. తమ విధానాలు, తమ అవినీతిపై మాట్లాడకుండా ప్రజల్ని బెదిరింపులతో అణచి వేస్తున్నట్టుగానే అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకోవాలన్న తాపత్రయం కనిపిస్తోంది.
గత టీడీపీ హయాంలో ఇజ్రాయిల్ నుంచి తెప్పించిన అత్యాధునిక పరికరాలతో ప్రతిపక్ష నాయకులు, వైయస్ఆర్‌సీపీ ముఖ్య నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఇప్పుడూ కూటమి ప్రభుత్వం అదే విధానాలు అవలంబిస్తోంది. ఆ పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు బరి తెగించి వైయస్ఆర్‌సీపీ కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. దాన్ని బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బెదిరిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం లీకవుతున్నా, దాంతో కూటమి పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు దిగుతున్నా పోలీసులు మాత్రం తమకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. పవన్‌కళ్యాన్ వీరాభిమాని, జనసేన కార్యకర్త డిప్యూటీ సీఎం తాలుకా అనే ఎక్స్ హ్యాండిల్ నుంచి ప్రజల వ్యక్తిగత సమాచారం పోస్ట్ అవుతోంది. వ్యక్తుల ఫోన్ నెంబర్లు, లోకేషన్‌తో పాటు, ఫ్యామిలీ పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. వాటిని చూపుతూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. బెదిరిస్తున్నారు. పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా చర్యలు చేపడితే బాగుంటుంది అని తెలిపారు.