అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం రుద్రంపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రుద్రంపల్లిలో టీడీపీ కార్యకర్తకు చెందిన ఓ ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ప్రమాద సమయంలో కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నారు. మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు గంగన్న, శ్రీదేవి, కూతురు సంధ్య ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి తక్షణ సాయం అందించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.