బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హీటెక్కింది. ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్‌తో టెస్టు మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారాయి. రెండో టెస్టు తొలి రోజు ఆటలో మార్నస్ లబుషేన్, జస్ప్రీత్ బుమ్రా మధ్య చిన్నపాటి ఎపిసోడ్ జరగ్గా.. రెండో రోజు ఆట మాత్రం పీక్స్‌లోకి వెళ్లింది. అభిమానులు ముద్దుగా డీఎస్పీగా పిలుచుకునే మొహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో మాటలయుద్ధం జరిగింది. ఇద్దరు ప్లేయర్లూ ఒకరిని ఒకరు దూషించుకోవడంతో.. మ్యాచ్ హీటెక్కింది.
భారత జట్టు బ్యాటింగ్ చేసే సమయంలో ఆస్ట్రేలియా బౌలర్లు దూకుడుగా సంబరాలు చేసుకుంటూ.. పదేపదే నోటికి పనిచెప్పారు. మేమేం తక్కువ కాదు అన్నట్లు భారత బౌలర్లు కూడా అదే తరహాలో స్లెడ్జింగ్ చేస్తూ ఆసీస్ బ్యాటర్లను కవ్విస్తున్నారు. దూకుడుకు మారుపేరైన విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్ ఈ తరహా చర్యల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆడిలైడ్ టెస్టు రెండో రోజు ఆటలోనూ ఇదే జరిగింది.
భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారైన ట్రావిస్ హెడ్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. అయితే ఓ స్టన్నింగ్ డెలివరీతో అతడి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు సిరాజ్. అంతకుమందే తన ఓవర్లో హెడ్ సిక్స్ కొట్టాడని కోపంలో ఉన్న సిరాజ్.. అతడిని క్లీన్ బౌల్డ్ చేసి గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇది చూసిన హెడ్ కూడా తన నోటికి పని చెప్పాడు.
అసలే వికెట్ తీసిన సంబురంలో ఉన్న సిరాజ్.. ఇక ఊరుకుంటాడా..! ఇక చాలులే వెళ్లిపో.. అన్నట్లుగా హెడ్‌కు సైగ చేశాడు. దీంతో కోపంలో ఏదో అనుకుంటూనే హెడ్ పెవిలియన్ బాట పట్టాడు. తమ దేశానికి చెందిన ప్లేయర్‌ను సిరాజ్ తిడతాడా అని అనుకున్నారో ఏమోగానీ.. ఆస్ట్రేలియా ఫ్యాన్స్ సిరాజ్‌ను ఉద్దేశిస్తూ.. బూ.. బూ.. అని అరిచారు. అయినా సిరాజ్ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను ఉద్దేశించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. డీఎస్పీ సిరాజ్.. హెడ్‌ను అరెస్టు చేశాడంటూ మీమ్స్‌తో ట్విట్టర్ హోరెత్తిపోతోంది.