బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. 86/1తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. ట్రావిస్ హెడ్ సెంచరీ చేయడంతో భారీ స్కోరు చేసింది. 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు 157 పరుగుల విలువైన ఆధిక్యం లభించింది.
ఓవర్ నైట్ స్కోరు 86/1తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. 15 పరుగుల వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మెక్ స్వీని (39), స్టీవ్ స్మిత్ (2)లను జస్‌ప్రీత్ బుమ్రా వెనక్కి పంపించాడు. ఈ దశలో లబుేషేన్ (64), ట్రావిస్ హెడ్‌లు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 65 పరుగులు జోడించిన అనంతరం లబుషేన్.. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కాసేపటికే మిచెల్ మార్ష్ (9) కూడా ఔట్ కావడంతో ఆసీస్ 208 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
ఓ పక్క వికెట్లు పడుతున్న ట్రావిస్ హెడ్ మాత్రం ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత ధాటిగా బ్యాటింగ్ చేసిన హెడ్.. ఆధిక్యాన్ని వంద పరుగులు దాటించాడు. చివరకు మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 141 బంతుల్లో 140 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కమిన్స్ (12), మిచెల్ స్టార్క్ (18) కాసేపు నిలబడటంతో ఆ జట్టు లీడ్ 150 పరుగుల మార్కును ధాటింది. చివరకు ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ నాలుగేసి వికెట్ల చొప్పున తీశారు. నితీశ్ కుమార్ రెడ్డి, రవి చంద్రన్ అశ్విన్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగులకు ఆలౌట్ అయింది. 157 పరుగుల లోటుతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో సత్తాచాటితేనే టీమిండియా పోటీలోకి వస్తుంది.