తెలుగు సినీ చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ గా పుష్ప-2 ది రూల్ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన రెండ్రోజుల్లోనే రెండు ఆల్ టైమ్ రికార్డులు బద్దలయ్యాయి. ఈ నేపథ్యంలో, పుష్ప-2 చిత్రబృందం నేడు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్, రవిశంకర్, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ తన డైరెక్షన్ టీమ్ ను పేరుపేరునా పరిచయం చేశారు. పుష్ప-2 మేకింగ్ లో వారు తనకు ఎలా సహాయపడిందీ వివరించారు. అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. మొదట "థాంక్యూ ఇండియా... ఇవాళ నేను చెప్పాల్సింది ఇదే" అంటూ తన స్పీచ్ ప్రారంభించారు. పుష్ప-2 చిత్రానికి తిరుగులేని విజయం అందించారని తెలిపారు. ఇవాళ థాంక్యూ చెప్పడమే తనకు ప్రధాన విషయం అని అన్నారు. "ఈ సినిమాకు పనిచేసిన నా టెక్నీషియన్లందరికీ, ఆర్టిస్టులందరికీ... నన్ను, సుకుమార్ ను నమ్మి మాకోసం ఎంతో డబ్బు ఖర్చుపెట్టి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్లిన నవీన్, రవిశంకర్, చెర్రీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఈ సక్సెస్ మీట్ చివర్లో నిర్మాత రవిశంకర్ వేదికపైకి వచ్చి ఆసక్తికర అంశం వెల్లడించారు. తాము రెండ్రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ను రూ.449 కోట్లు అని ప్రకటించామని, కానీ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు ఫోన్ చేసి అప్ డేట్ చేసిన సమాచారం అందించారని, పుష్ప-2 రెండ్రోజుల గ్రాస్ రూ.500 కోట్లు దాటిపోయిందని ప్రకటించారు. ఇక, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తమకు పర్సనల్ గా ఎంతో సాయం చేశారని, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని నిర్మాత రవిశంకర్ పేర్కొన్నారు.