వైసీపీ నేతలపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలు బయటపడేకొద్దీ.. ట్వీట్లు పెరుగుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుటుంబసభ్యులపై ఆరోపణలు వస్తున్నాయని వంగలపూడి అనిత చెప్పారు. ఆదివారం విశాఖపట్నంలో వంగలపూడి అనిత పర్యటించారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను వంగలపూడి అనిత ప్రారంభించారు. అనంతరం విశాఖపట్నం పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు 2018లో అప్పటి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప భూమి పూజ చేసిన సంగతిని వంగలపూడి అనిత గుర్తు చేశారు.
చినరాజప్ప భూమిపూజ చేసిన ఆరిలోవ పోలీస్ స్టేషన్‌ను తాను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అనిత చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క పోలీస్ స్టేషన్ నిర్మాణం కూడా జరగలేదన్న వంగలపూడి అనిత.. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల అంశం మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని.. బాడీ కెమెరాలు, ఫేస్ డిటెక్టివ్ సిస్టమ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులకు వివరించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ తీసుకువచ్చామని.. ఈ వ్యవస్థ అప్పుడే పని మొదలుపెట్టిందని చెప్పారు. ఇక డ్రోన్ల సాయంతో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేస్తున్నట్లు వివరించారు.
మరోవైపు విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్న హోం మంత్రి.. రోడ్డు ప్రమాద బాధితులకు సహకార కేంద్రం ప్రారంభించామని చెప్పారు. వారికి సహాయం చేసేందుకు 7995095793 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తున్నామని.. ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు.
మరోవైపు వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తిపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్న వంగలపూడి అనిత.. విజయసాయిరెడ్డి శకుని లాంటి వ్యక్తి అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతల పాపాలు బయటకు వస్తున్న కొద్దీ ట్వీట్లు పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. కాకినాడ పోర్ట్ వేదికగా రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని.. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.