రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తునకు నియమించిన సిట్‌లో ముగ్గురు డీఎస్పీలపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దృష్టి సారించింది. వారి నియామకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. సిట్‌లో వారిని కొనసాగిస్తే వాస్తవాలు బయటకు రావని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యేలు నేరుగా ఫిర్యాదులు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కారణాలతో పలువురు డీఎస్పీలను వీఆర్‌కు పంపింది. వీఆర్‌లో ముగ్గుర్ని రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తునకు వేసిన సిట్‌లో నియమించింది. దీనిపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డీఎస్పీ లను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహరాన్ని తమ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌పై సమగ్ర విచారణ జరగాలనే ఉద్దేశంతో సీబీసీఐడీ దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశించారని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 1066 కేసులు నమోదు చేసి, 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. సీజ్ చేసిన బియ్యం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.240 కోట్లు ఉంటుందన్నారు. అయినా, వాళ్లు చేస్తున్న అరాచకంలో అది చాలా తక్కువ శాతమని తెలిపారు. ఒక్క కాకినాడ పోర్టు నుంచే గత మూడేళ్లలో కోటి 31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం విదేశాలకు తరలిపోయిందన్నారు.
అక్కడ స్మగ్లింగ్ డెన్‌గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించే విధంగా వారు పరిపాలించిన తీరు అందరికీ తెలిసిందేనని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులు, స్మగ్లింగ్‌పైన సమగ్ర విచారణ జరగాలనే ఉద్దేశంతో సీబీసీఐడీకి దీనిని అప్పగించారని తెలిపారు. ధాన్యం కొనుగోలు లేదా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ఏదైనా కావచ్చ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించాలని రైస్ మిల్లర్ల యాజమాన్యాలను మంత్రి కోరారు. నిజాయితీగా, పారదర్శకంగా వ్యాపారాన్ని చేస్తే ఎక్కడా ఇబ్బంది పెట్టబోమని, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యే విధంగా మీరు నిలబడాలని సూచించారు.