బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో యువ ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఆడుతున్న విషయం తెలిసిందే. అనుభవం లేని ఈ ఆటగాళ్లను ప్రతిష్ఠాత్మక సిరీస్‌కు ఎంపిక చేయడం సెలక్షన్ సమయంలో చర్చనీయాంశమైంది. ఇక ఇద్దరూ తుది జట్టులో కూడా చోటు దక్కించుకొని ఆడుతుండడం ఆశ్చర్యం కలిగించింది. అయితే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇద్దరూ రాణించి అందరి ప్రశంసలు అందుకున్నారు. భారత్ కూడా ఘన విజయం సాధించడంతో అందరూ హర్షించారు. అయితే, అడిలైడ్ వేదికగా జరిగిన రెండవ మ్యాచ్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో రాణించలేకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లు మాత్రమే వేసిన ఈ యువ పేసర్ ఏకంగా 86 పరుగులు సమర్పించుకోవడం చర్చనీయాంశమైంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో అతడికి బౌలింగ్ ఇవ్వలేదు. ఆస్ట్రేలియా విజయ లక్ష్యం కూడా కేవలం 19 పరుగులే కావడంతో బౌలింగ్ ఇవాల్సిన అవసరం కూడా రాలేదు.అడిలైడ్ టెస్ట్ ఓటమి నేపథ్యంలో అనుభవం లేని హర్షిత్, నితీశ్ కుమార్ రెడ్డిలను బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయడంపై పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పట్టుబట్టు మరీ ఇద్దరినీ ఎంపిక చేయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఆడేందుకు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని గంభీర్ పట్టుబట్టగా.. సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ కూడా అంగీకరించారు. నిజానికి నితీశ్ కుమార్ రెడ్డి విషయంలో ఎవరూ అంతగా నోరు మెదపడం లేదు. ఎందుకంటే పెర్త్ టెస్టులో టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. ఇక అడిలైడ్ టెస్టులోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. కానీ హర్షత్ రాణా మాత్రం అడిలైడ్‌లో పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. తొలి టెస్టులో 4 వికెట్లు తీశాడు. పరుగులు కూడా తక్కువగానే ఇచ్చాడు. అడిలైడ్ టెస్టులో పేలవ ప్రదర్శన చేశాడు. పైగా టెస్టుల్లో వన్డేల తరహాలో పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో తాను కోచ్‌గా వ్యవహరించిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు (కేకేఆర్) చెందిన పేసర్‌కు మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యలు వస్తున్నాయి. నిజానికి హర్షిత్ రాణా ఐపీఎల్‌లో కేకేఆర్ కాదు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో గణాంకాలు కూడా బావున్నాయి. దేశవాళీ మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన చూసిన అనంతరమే అతడిని ఎంపిక చేసేందుకు గంభీర్ మొగ్గు చూపాడు.