ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. మీ శ్రేయోభిలాషి అంటూ లేఖలో సంబోధించారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పలుమార్లు ప్రస్తావించారని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలనేదే తన వాదన అని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు బీజేపీతో కలిసి పనిచేయటం వల్ల రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవటానికి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవటానికి ఇదే సరైన సమయమని అన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరు, ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చకు నోటీసులు ఇప్పించాలన్నారు. సుప్రీంకోర్టులో చాలాకాలంగా పెండింగ్‌లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు.