ఓవైపు మిలిటెంట్ సంస్థలు, వాటికి మద్దతిచ్చే దేశాలతో ఇజ్రాయెల్ పోరాటం సాగిస్తుండగా... మరోవైపు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్నారు. ఎంతో సీనియర్ రాజకీయవేత్త అయిన నెతన్యాహు ఇప్పుడు అవినీతి కేసులో టెల్ అవీవ్ కోర్టుకు హాజరయ్యారు. తనకు అనుకూలంగా వార్తలు ప్రసారం చేసేందుకు కొన్ని మీడియా సంస్థలకు సాయం చేయడం, ఓ హాలీవుడ్ నిర్మాత నుంచి ఖరీదైన బహుమతులు అందుకుని, అందుకు ప్రతిఫలంగా అతడికి లబ్ధి చేకూర్చారన్నది నెతన్యాహుపై ఉన్న ఆరోపణలు. నాలుగేళ్ల కిందట ఈ కేసు విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో... అవినీతి ఆరోపణలు, విశ్వాస ఘాతుకం, మోసం అభియోగాలపై కోర్టు నేడు విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణ కోర్టు హాల్ లో కాకుండా... కోర్టు భూగర్భంలో ఉన్న బంకర్ లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ యుద్ధంలో పరిస్థితులు ఎదుర్కొంటుండడంతో, ఈ విచారణను బంకర్ లో చేపట్టారు.