దశాబ్దాల కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల్లో అత్యంత ప్రధానమైన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్‌మాధుర్‌తో పాటు ఏపీకి చెందిన ఎంపీల బృందం మంగళవారం కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను అభ్యర్థించింది. ఎంపీ హరీష్‌తో పాటు టీడీపీ పార్లమెంటరీ పక్షనేత లావు శ్రీకృష్ణదేవరాయులు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్లమెంటు సభ్యులు కలిశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందించారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేసేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టాలని కోరారు. భట్నవిల్లి వరకు ఫేజ్-1 భూసేకరణ పూర్తి అయిందని, రెండో దశలో భాగంగా వంతెనల నిర్మాణానికి అవసరమైన భూమిని కూడా సేకరించారని, ఈ పంట సాగు తరువాత ఆ భూమిని స్వాధీనం చేసుకుని రైల్వేశాఖకు అప్పగిస్తామని తెలిపారు. భట్నవిల్లి అమలాపురం పట్టణానికి సమీపంలో ఉన్న దృష్ట్యా ప్రయాణికులు, సరుకు రవాణాకు ఎంతో అనుకూలంగా ఉంటుందని, కోటిపల్లి నుంచి భట్నవిల్లి వరకు అనుసంధానంచేసి వీలైనంత వరకు ట్రాక్‌ల నిర్మాణం యుద్ధ ప్రాతిపధికన చేపట్టి పూర్తి చేయాలని కోరారు. దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి చిరకాల కోరిక అయిన ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభించేందుకు కృషి చేయాలని, అమలాపురంలో గతంలో ఏర్పాటుచేసి తొలగించిన రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను పునరుద్ధరించాలని.. ద్వారపూడి రైల్వేస్టేషన్‌లో ఉదయ్, కోణార్క్, జన్మభూమి రైళ్లకు హాల్ట్ సౌకర్యం పెంచాలని ఎంపీ హరీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రం ఎంపీలతో కలిసి వినతిపత్రాన్ని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌కు అందజేసినట్టు తెలిపారు.