ఆక్వా చెరువుల వద్ద ఫొటోలు తీస్తున్నాడన్న కోపంతో కొందరు ఒక యువకుడిని స్తంభానికి కట్టి కొట్టారు. ప్రస్తుతం బాధితుడు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో కొంతకాలంగా ఆక్వా సాగుకు వ్యతిరేకంగా కొందరు యువకులు ఆందోళన చేస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించి రొయ్యల చెరువులను మూసివేయించారు. తాజాగా సోమవారం సాయంత్రం రొయ్యల సాగు తిరిగి ప్రారంభిస్తున్నారని తెలుసుకున్న గ్రామానికి చెందిన చిక్కం వీరదుర్గాప్రసాద్ ఆ ప్రాంతానికి వెళ్లి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన రైతులు అతడిని స్తంభానికి కట్టి కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చిక్కం గాంధి, గనిశెట్టి శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యనారాయణ, వెంకట్రాజుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చలమల రాజేష్ తెలిపారు.