ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా కలెక్టర్ల సమావేశంలో చర్చించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం ఏపీ కలెక్టర్ల సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. 1994 నుంచి సీఎం చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నానని.. చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఎంత తపనతో పని చేశారో ఇప్పుడూ అదే తపనతో ముందుకెళ్తున్నారన్నారు. ప్రజల కోసమే జీవితం, ప్రతి పనిలోనూ మానవత్వం అనే లక్ష్యంతో పాలన అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారసత్వంగా వచ్చిన ప్రధాన సమస్య రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పు అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో 99 శాతం రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే సరిపోయిందన్నారు. అంతకుముందు రెండేళ్లు 107 శాతం రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే వెచ్చించారని చెప్పారు.