ఏపీలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. భోజన విరామం తర్వాత రాష్ట్రంలో ఫిర్యాదుల స్వీకరణపై కలెక్టర్ల సదస్సులో సమీక్ష జరిగింది. గ్రీవెన్స్ పరిష్కారంపై సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజావేదిక, గ్రీవెన్స్ సెల్, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు అందే ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు చేరుతాయని వివరించారు. ఎక్కువ ఫిర్యాదులు భూ వివాదాలపైనే ఉన్నాయన్నారు. గడిచిన ఆరు నెలలుగా ప్రజల నుంచి 1,29,963 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. 78,700 ఫిర్యాదులు అన్నీ రెవెన్యూ విభాగం నుంచే వచ్చాయన్నారు. 14,119 ఫిర్యాదులు పోలీసు విభాగానికి చెందినవి అని తెలిపారు. అలాగే 13,146 మున్సిపల్ శాఖలో ఫిర్యాదులు వచ్చాయన్నారు. సమస్యను అడ్రస్ చేశాక కూడా తమ సమస్య పరిష్కారం కాలేదని మరలా వస్తున్నాయని తెలిపారు. జూన్ నుంచి నవంబర్ వరకూ ప్రజల్లో సంతృప్తి అనేది పెరగకుండా తగ్గుతోందన్నారు. అగ్రికల్చర్, విద్యుత్, హెల్త్ డిపార్టమెంట్లలో సంతృప్త స్థాయి ఎక్కువగా ఉందని ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు.