అమ్మతనం గొప్పదా, ఐదోతనం గొప్పదా అని ఎవరైనా స్త్రీని అడిగితే అమ్మతనమే గొప్పదంటారు. పుట్టిన బిడ్డలను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ముఖ్యంగా పిల్లలు చిన్నగా ఉంటే భర్తను పట్టించుకోవడం మానేసి మరీ చిన్నారులను కంటికి రెప్పలా కాచుకుంటారు. కానీ కర్ణాటకకు చెందిన ఓ మహిళ మాత్రం తన పతిదేవుడి కోసం అమ్మతనాన్ని వదులుకుంది. బిడ్డ పుట్టి నెలరోజులు కూడా కాకముందే ఆ చిన్నారిని అమ్మకానికి పెట్టేసింది. రూ.1.5కు విక్రయించేసింది కూడా. ఆ స్టోరీ పూర్తి వివరాలంటో మనం ఇప్పుడు చూద్దాం.
కర్ణాటక రామనగర్‌కు చెందిన దంపతులకు నలుగురు సంతానం. వీరిద్దరూ దినసరి కూలీలు. రోజూ పనికి వెళ్లగా వచ్చిన డబ్బులతోనే జీవనం సాగించేవారు. అయితే ఇటీవలే ఆ మహిళ మళ్లీ తల్లి అయింది. ఐదో సంతానంగా బాబు పుట్టాడు. ఆ నవజాత శిశువు వయసు సరిగ్గా నేటికి 30 రోజులు. బాబు చిన్నవాడు కావడంతో భార్య, పిల్లలను ఇంట్లోనే ఉంచి భర్త మాత్రమే కూలీ పనికి వెళ్తున్నాడు. డిసెంబర్ 5వ తేదీన అతడు వచ్చేసరికి బాబు ఇంట్లో కనిపించలేదు. దీంతో అతడు భార్యను అడిగాడు. బాబుకు ఆరోగ్యం బాగాలేదని అందుకే తమ బంధువుకు ఇచ్చి ఆస్పత్రికి పంపించానని ఆమె చెప్పింది.
అది నిజమేనని నమ్మిన అతడు ఆరోజు రాత్రి తిని పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే పనికి వెళ్లాడు. మళ్లీ రాత్రికి తిరిగి వచ్చాక కూడా బాబు కనిపించలేదు. మరోసారి అతను భార్యను నిలదీశాడు. ఈసారి ఆమె తడబడడంతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె వాగ్వాదానికి దిగింది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటనలో భర్త తలపై గాయం అయింది. ఇక లాభం లేదనుకుని మరుసటి రోజు ఉదయమే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన బాబు కనిపించడం లేదని భర్త ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ వద్దకు వెళ్లి బాబు గురించి ఆరా తీశారు. అప్పుడు కూడా ఆమె బంధువు దగ్గరే బాబు ఉన్నాడని బుకాయించింది.
కానీ ఆ బంధువు గురించి ఆరా తీసి.. తీరా అక్కడకు వెళ్తే పోలీసులకు బాబు కనిపించలేదు. దీంతో మరోసారి మహిళను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్‌లో విచారించారు. ఇలా మహిళ తన నెల రోజుల వయసు ఉన్న బాబును రూ1.5 లక్షలకు బెంగళూరులోని ఓ ఒంటరి మహిళకు విక్రయించినట్లు తెలుసుకున్నారు. అలాగే బాబును అమ్మడానికి గల కారణాలు తెలుసుకుని షాకయ్యారు. ఇంటిని నడిపేందుకు తన భర్త చాలా కష్టపడుతున్నాడని.. 3 లక్షల అప్పు కూడా చేశాడని మహిళ పోలీసులకు వివరించింది. ఆ అప్పును తీర్చాలనే ఉద్దేశంతోనే తన కొడుకును అమ్ముకోవాలనుకున్నట్లు కూడా స్పష్టం చేసింది.
ఇదంతా విన్న పోలీసులు వెంటనే వెళ్లి బాబును కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి చిన్నారిని తీసుకువచ్చారు. అనంతరం మండ్యా శిశుసంరక్షణా కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న భర్త.. బాబును అమ్మేద్దాం.. అప్పు తీర్చేద్దామని భర్య చెబుతుంటే జోక్ అనుకున్నానని.. కానీ ఆమె ఇలా చేస్తుందని అస్సలే ఊహించలేదని తెలిపారు.