లోక్‌సభతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఎప్పటినుంచో జమిలి ఎన్నికలను ప్రవేశపెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే లా కమిషన్ సూచనలు, రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులు సహా మరిన్ని అంశాలను ఇప్పటికే సేకరించి ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును రూపొందించి.. కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కల్పించింది. త్వరలోనే పార్లమెంటు ముందుకు ఈ జమిలి ఎన్నికల బిల్లు రానుంది. ఈ నేపథ్యంలోనే రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సూచించిన సిఫార్సుల మేరకు.. ఆ బిల్లు ఆమోదం పొందాలంటే కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది.
అయితే కొన్ని రోజుల క్రితం.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 6 నెలలకు పైగా చర్చించి.. 18,626 పేజీలతో కూడిన ఒక నివేదికను సమర్పించింది. ఈ క్రమంలోనే దేశంలో జమిలి ఎన్నికలు అమలు చేయాలంటే కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇక ఈ రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది.
జమిలి ఎన్నికల అమలుకు చేయాల్సిన రాజ్యాంగ సవరణలు
లోక్‌సభ, రాజ్యసభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 సవరణ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1)ని సవరించడం.
ఎమర్జెన్సీ పరిస్థితుల సమయంలో సభ కాలపరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2)ని సవరించడం.
రాష్ట్రపతికి లోక్‌సభను రద్దు చేసే అధికారాలు ఇచ్చే ఆర్టికల్ 85 (2) (బి) సవరణ చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రాల అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్‌కు ఉండే ఆర్టికల్ 174 (2) (బి)ని సవరించాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి సవరణ చేయాలి.
ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 324ను సవరించాల్సి ఉంది.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదట్లో దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగేవి. దేశంలో జరిగిన 1957, 1962, 1967 సాధారణ ఎన్నికలు జమిలి ఎన్నికలే కావడం గమనార్హం. ఆ తర్వాత వివిధ రకాల పరిస్థితుల కారణంగా జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో.. లోక్‌సభకు ఒకసారి.. ఇతర రాష్ట్రాల అసెంబ్లీలకు ఒక్కోసారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతోంది. అయితే 1980లోనే జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత 1999లో లా కమిషన్ కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలని తెలిపింది. అయినా దేశంలో అది అమలు చేయడం సాధ్యం కాలేదు. ఇక 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ.. తమ మేనిఫెస్టోలో జమిలి ఎన్నికల హామీని ఇస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దూకుడు చూస్తుంటే.. 2027లోనే దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.