లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే ఈ జమిలి ఎన్నికలు. అయితే ఈ ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి ఇప్పటికే లా కమిషన్ తీసుకున్న ప్రతిపాదనలు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో వేసిన ఉన్నతస్థాయి కమిటీ సమర్పించిన రిపోర్ట్ సహా అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశంలో జమిలి ఎన్నికలను ప్రవేశపెట్టాలని కంకణం కట్టుకుంది. అందుకు రాజ్యాంగ సవరణలు కూడా చేసేందుకు సిద్ధం అయింది. తాజాగా జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. పార్లమెంటు ముందుకు రావడమే తరువాయి కానుంది. ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించుకునే బలం.. పార్లమెంటులో ఎన్డీఏ కూటమికి ఉందా. అసలు ఈ బిల్లు ఆమోదం పొందాలంటే అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో ఎంత బలం కావాలి అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లును ముందుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ-జేపీసీకి పంపించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అవసరం అనుకుంటే జేపీసీ వేసి వివిధ పార్టీలతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ జమిలి ఎన్నిక కోసం రూపొందించిన ఈ బిల్లు చట్టంగా మారాలంటే కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి.. లోక్‌సభ, రాజ్యసభల్లో మూడింట రెండొంతుల మంది సభ్యుల మెజారిటీ తప్పకుండా కావాలి. అంటే లోక్‌సభలో మొత్తం ఉన్న 545 సభ్యుల్లో మూడింట రెండొంతులు అంటే కనీసం 364 మంది ఎంపీలు ఈ బిల్లుకు మద్దతుగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఇక రాజ్యసభ విషయానికి వస్తే 245 మంది సభ్యుల్లో.. కనీసం 164 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్డీఏకు లోక్‌సభలో 293 మంది ఎంపీల మద్దతు ఉండగా.. రాజ్యసభలో 125 సభ్యుల బలం ఉంది. అయితే ఈ బిల్లును ఆమోదించుకోవాలంటే ఇతర పార్టీల ఎంపీల మద్దతును కూడా బీజేపీ కూడగట్టాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సాధారణ మెజారిటీతోనే నడుస్తోంది. కాబట్టి ఈ జమిలి ఎన్నికల బిల్లు ఓటింగ్ సమయానికల్లా మూడింట రెండొంతుల మెజారిటీ మద్దతును కూడగట్టుకోవాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు దేశంలో ఉన్న మొత్తం 47 పార్టీల్లో 32 పార్టీలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. అంటే మరో 13 రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత లోక్‌సభ గడువు 2029 వరకు ఉంది. కానీ ఆలోపు 2025, 2026, 2027, 2028, 2029 లలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే.. వాటి అసెంబ్లీ గడువు కాలాన్ని పెంచడం, తగ్గించడం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.