ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన.. భారతీయుల్లో కలవరం

international |  Suryaa Desk  | Published : Thu, Dec 12, 2024, 10:01 PM

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వ హక్కును  రద్దుచేయడానికి సిద్దమయ్యారు. 150 ఏళ్లకుపైగా అమెరికా రాజ్యాంగంలో ఉన్న ఈ హక్కు చాలా హాస్యాస్పదమైందని నమ్ముతోన్న ట్రంప్.. దాని రద్దుకు మొగ్గుచూపుతున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. తల్లిదండ్రులు పౌరసత్వంతో సంబంధం లేకుండా ఆ గడ్డపై పుట్టినవారికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అయితే, తాజా ఓ ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. త్వరలోనే దీనిని ముగిస్తామని చెప్పారు. జన్మతః పౌరసత్వ హక్కుపై ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంటాం.. కానీ, మార్చడం మాత్రం తథ్యమని తేల్చిచెప్పారు. మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రంప్ దీనిని రద్దుచేయాలని భావించినా అది సాధ్యం కాలేదు.


 ‘ఏ దేశంలోనూ ఇలా ఉండదు.. వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు.. అమెరికా పౌరుడిగా మారడానికి కఠినమైన ప్రమాణాలు ఉండాలని ట్రంప్, ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు’ అని సర్కిల్ ఆఫ్ కౌన్సిల్ సభ్యుడు రస్సెల్ ఏ స్టమెంట్స్ అన్నారు. జన్మతః పౌరసత్వ హక్కును 14వ సవరణ ద్వారా అమెరికా రాజ్యాంగంలో చేర్చారు. కాబట్టి దీనిని ఒకవేళ ట్రంప్ రద్దుచేసినా న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. 14 రాజ్యాంగ సవరణ ప్రకారం.. ‘అమెరికాలో జన్మించినవారు దాని అధికార పరిధికి లోబడి నివసించే దేశ పౌరులుగా గుర్తింపు పొందుతారు’ అని తెలిపింది.


అయితే, ట్రంప్ సహా ఈ హక్కును వ్యతిరేకించేవారు మాత్రం బర్త్ టూరిజాన్ని ఇది ప్రోత్సహిస్తుందని ఆరోపిస్తున్నారు. గర్బంతో ఉన్న మహిళ.. తన బిడ్డకు అమెరికా పౌరసత్వం కోసం ఇక్కడకు వచ్చి ప్రసవించి తన దేశానికి వెళ్లిపోతుందని వాదిస్తున్నారు. ‘‘సరిహద్దు దాటి వచ్చి ఇక్క బిడ్డను కనడం వల్ల ఎవరికీ పౌరసత్వం లభించదు’ అని వలసలవాదాన్ని వ్యతిరేకించే రిసెర్చ్ ఫర్ నంబర్స్ అమెరికా డైరెక్టర్ ఎరిక్ రౌర్క్ వ్యాఖ్యానించారు.


ట్రంప్ సైతం ‘నేను కుటుంబాలను విచ్ఛిన్నం చేయకూడదనుకుంటున్నాను.. కాబట్టి మీ కుటుంబం విడిపోకూడదంటే ఏకైక మార్గం కలిసి ఉంచడం.. మీరు వారందరినీ తిరిగి వెనక్కి పంపాలి’ అని అన్నారు. అంటే చట్టబద్ధమైన పౌరులను కూడా కుటుంబాలతో సహా బహిష్కరించాలని దీని అర్ధం. ఇక, 2011లో అమెరికా ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ ఫ్యాక్ట్‌షీట్ సైతం జన్మతః పౌరసత్వ హక్కు రద్దుచేస్తే ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుందని, అమెరికా తల్లిదండ్రులు సైతం తమ పిల్లల పౌరసత్వ హక్కును నిరూపించుకోవడం కష్టంగా మారుతుందని అభిప్రాయపడింది.


‘జనన ధ్రువీకరణ పత్రాలు మన పౌరసత్వానికి రుజువు... జన్మతః పౌరసత్వ హక్కును తొలగిస్తే అమెరికా పౌరులు ఇకపై తమ జనన ధ్రువీకరణ పత్రాలను పౌరసత్వానికి ఆధారంగా ఉపయోగించలేరు’ అని ఫ్యాక్ట్‌షీట్ పేర్కొంది. ఇక, 2022 ప్యూ రిసెర్చ్ విశ్లేషణ ప్రకారం.. అమెరికాలో 4.8 మిలియన్ల మంది భారత సంతతి పౌరులు ఉండగా.. వీరిలో 34 శాతం మంది (1.6 మిలియన్లు) అక్కడ జన్మించివారే. వీరికి ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం జన్మతః పౌరసత్వ హక్కు లభించింది. ఒకవేళ ట్రంప్ రద్దు చేస్తే ఈ 1.6 మిలియన్ల మందిపై ప్రభావం చూపుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com