అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్.. జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన గతం కంటే మరింత దూకుడుగా వ్యవహరించాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే తన యంత్రాంగంలో ఎవరెవరు ఉండాలో నిర్ణయించుకుని.. వారికి కీలక పదవులను కట్టబెడుతున్నారు. అయితే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రోజే పెను సంచలనానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు. దాదాపు 25 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఇమిగ్రేషన్ నుంచి ఇంధనం వరకు కీలక అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక, 2016 ఎన్నికల్లో గెలిచి తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడిగా మొదటిరోజు కొన్ని ఉత్తర్వులపై మాత్రమే సంతకాలు చేశారు. కానీ, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 2021 జనవరి 20న బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు ఏకంగా 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. తాజాగా, ఈ రికార్డను ట్రంప్ అధిగమించనున్నారు. మొదటి టర్మ్‌లో మాదిరిగా కాకుండా మరింత దూకుడు ప్రదర్శించాలని రిపబ్లికన్ నేత యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తొలిరోజు దాదాపు 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ట్రంప్ సూచనలు కూడా చేసినట్లు తెలుస్తోంది.
‘బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే తన కార్యనిర్వాహఖ అధికారాలను ఉపయోగించి ఎన్నికల్లో హమీలపై సంతకం చేసి అమెరికా ప్రజలకు ఇచ్చిన మాటను ట్రంప్ నిలబెట్టుకుంటారు’ అని డొనాల్డ్ ట్రంప్ అధికార ప్రతినిధి కరోలైన్ లెవెట్టి అన్నారు. సరిహద్దులకు సంబంధించి బైడెన్ నిర్ణయాలను ట్రంప్ రద్దుచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మెక్సికో సరిహద్దుకు అదనపు బలగాల తరలింపు, రక్షణ గోడను పునర్నిర్మాణం వంటి అంశాలపై ఆయ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, కాంగ్రెస్ ఆమోదంతో చట్టంగా మారే సుదీర్ఘ ప్రక్రియా ద్వారా కాకుండా ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడానికి, తమ విధానపరమైన లక్ష్యాలను త్వరితగతిన అమలుచేయడానికి అమెరికా అధ్యక్షులు తరుచూ కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేస్తారు. అయితే, ఈ ఉత్తర్వులు న్యాయస్థానాలకు లోబడి ఉంటాయి. సాధారణంగా వీటిని అమలు చేయడానికి కేటాయించిన మొత్తాన్ని కాంగ్రెస్ సైతం ఆమోదించాలి.
అయితే, ట్రంప్ ఉత్తర్వుల అమలు విషయంలో ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయం అవసరమని, ఒకే రోజు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు జారీ చేస్తే పనితీరు మందగించే అవకాశం ఉంది కాబట్టి వీటిని తగ్గించవచ్చని ట్రంప్ బృందం భావిస్తోన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు, దిగుమతి సుంకాలను విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను జో బైడెన్ తప్పుబట్టారు. అలాగే, ఆర్థిక వ్యవస్థ, విద్యా విధానం, పౌరహక్కులు, వలసలకు సంబంధించి ట్రంప్ మద్దతుదారులు ముందుకు తెస్తున్న ప్రాజెక్ట్-2025ను కూడా జో విమర్శించారు.