మధురవాడ శిల్పారామంలో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శనను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత వస్త్ర కళాకారులు రూపొందించిన ఉత్పత్తులను మధ్యవర్తులు లేకుండా నేరుగా విక్రయించుకునేలా ప్రభుత్వం ఇటువంటి వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేసిందని, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలతో పాటు దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మందికి పైగా కళాకారులు వివిధ రకాల ఉత్పత్తులను ఈ మేళాలో అందుబాటులో ఉంచారని అన్నారు. సరసమైన ధరలకు లభించే ఈ ఉత్పత్తులను ప్రజలంతా కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని గంటా కోరారు. చేనేత కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం చేనేత కళాకారులకు అనేక సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ఆర్ట్ క్రాఫ్ట్ కల్చరల్ సొసైటీ చైర్ పర్సన్ మంజులారెడ్డి, ముఖ్య కార్యనిర్వహణాధికారి వి. స్వామి నాయుడు, ఏవో విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు