రాజ్యసభ ఎంపీ గా ఆర్. కృష్ణయ్య మరోసారి ఏకగ్రీవం అయ్యారు. శుక్రవారం రిటర్నింగ్ ఆఫీసర్ నుండి నియామకపత్రం అందుకున్నారు.ఈ నేపథ్యంలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతాయి. కాగా, నియామకపత్రం తీసుకున్న సమయంలో ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం జాతీయ యువజన అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ తదితరులున్నారు. అనంతరం కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి రాజ్యసభ సభ్యులుగా తనకు అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గత 40 సంవత్సరాలుగా తాను బీసీలకు చేస్తున్న సేవలను గుర్తించి తనకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ఉద్యమం నేడు కీలక దశకు చేరుకున్నదని వివరించారు. దేశ ప్రధాని మోడీ పార్లమెంట్లో బీసీ బిల్లుకు అనుకూలంగా ఉన్నారని వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీలకు అందుతున్న సంక్షేమ పథకాలు యావత్ భారతదేశం మొత్తం అందేలాగా నరేంద్ర మోడీతో చర్చించి రూట్ మ్యాప్ ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.