ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏనుగులను కాల్చి చంపేందుకు అనుమతి ఇవ్వండి: అసెంబ్లీలో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే

national |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2024, 07:50 PM

పంటపొలాల్లోకి వస్తున్న ఏనుగులను కాల్చి చంపేందుకు అనుమతి కావాలంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పూంజా.. అక్కడి ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. రైతులకు గన్నులు ఇవ్వడంతో పాటు లైసెన్సులు కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇలా అడగడాన్ని అక్కడి ప్రజాప్రతినిధులు అంతా తప్పు పట్టారు. మీరిలా మాట్లాడడం తప్పంటూ చెప్పుకొచ్చారు. చట్టాల గురించి వివరించారు. అయితే ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్లు చేయడం వెనుక ఓ పెద్ద కథే ఉంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


కర్ణాటకలో ఏనుగుల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అడవి ఏనుగులు పంట పొలాల్లోకి చొరబడి రైతులకు తీవ్ర నష్టం కల్గిస్తున్నాయి. పొలాల్లో కనిపించిన రైతులను కూడా పడేస్తూ.. తీవ్ర గాయాలు చేస్తున్నాయి. దీంతో రైతులు పంట పొలాల్లోకి వెళ్లి పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల వాళ్లు అయితే వ్యవసాయ క్షేత్రాలకు ఒంటరిగా వెళ్లడమే మానేశారు. నెల రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో ఏనుగుల దాడులు జరిగాయి.


ఈ పరిస్థితులు అన్నింటినీ కళ్లారా చూసిన బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పూంజా.. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై షాకింగ్ కామెంట్లు చేశారు. బెల్తంగడి తాలూకాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏనుగుల బెడదపై అటవీ శాఖ చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏనుగుల బెడదను అంతం చేయడానికి రైతులకు ఏనుగులను చంపడానికి తుపాకీ లైసెన్స్‌లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత పంట పొలాల్లోకి వస్తున్న ఏనుగులను కాల్చి చంపేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు. ఇదే శాశ్వత పరిష్కారం అని తేల్చి చెప్పారు.


వెంటనే కర్ణాటక రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. ఎమ్మెల్యే హరీష్ పూంజాను అడ్డుకున్నారు. ఓ ప్రజా ప్రతినిధి అయ్యుండి మీరిలా మాట్లాడడం తప్పు అని సూచించారు. రైతుల సమస్యలు తీర్చేందుకు చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆ చట్టాలను ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పడం ఎమ్మెల్యేల పనే అంటూ వెల్లడించారు. ఇది చాలా దురదృష్టకరం అంటూ ఎమ్మెల్యే హరీష్ పూంజాపై అసహనం వ్యక్తం చేశారు.


ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ మాట్లాడుతూ.. భూమిపై జీవించే హక్కు మనుషులకు ఉన్నట్లుగానే జంతువులకు కూడా ఉందని తెలిపారు. అయితే ఎంత పెద్ద సమస్య అయినా సరే వాటిని చంపడం పరిష్కారం కాదని వివరించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా ఓ ఎమ్మెల్యే ఇలా ఎలా మాట్లాడారు అంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ జంతు ప్రేమికులు చెబుతున్నారు. మరికొందరేమో ఆయన ఇంత క్రూరంగా మాట్లాడడానికి కారణం.. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలే అంటూ చెప్పుకొస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com