తన బిడ్డను కలవనీయకుండా కన్నతల్లిని అడ్డుకోవడం క్రూరత్వమేనని, ఇది వేధింపుల కిందకే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలు ఆమె మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయస్తాయని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అత్తింటిపై మహిళ పెట్టిన కేసును కొట్టివేయడానికి జస్టిస్ విభా కనకన్‌వాడి, జస్టిస్ రోహిత్ జోషిల ధర్మాసనం ఈ మేరకు నిరాకరించింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర జాల్నాకు చెందిన మహిళకు 2019లో వివాహం కాగా.. 2020లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, అదనపు కట్నం కోసం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసిన భర్త, అత్తమామలు... బిడ్డను తమవద్దే ఉంచుకుని ఇంటి నుంచి బయటకు గెంటేశారు.
ఈ ఘటన 2022 మే నెలలో చోటుచేసుకోగా.. అప్పటి నుంచి బిడ్డను కలవనీయకుండా ఆమెను అడ్డుకుంటున్నారు. దాంతో ఆమె భర్త, అతడి కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. అంతేకాదు, పాపను తనకు అప్పగించాలని కోరుతూ ఆమె మేజిస్ట్రేటు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు. బిడ్డను అప్పగించాలని ఆదేశించింది. కానీ ఈ ఆదేశాలను భర్త బేఖాతరు చేయడంతో ఆమె హైకోర్టు గడపతొక్కారు.
ఇదే సమయంలో తమపై కేసును కొట్టివేయాలని కోరుతూ అత్త, మామ, ఆడపడుచు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ విభా కనకవాడి, జస్టిస్ రోహిత్ జోషిల ధర్మాసనం.. నాలుగేళ్ల పాపను తల్లికి దూరంగా ఉంచడం సెక్షన్ 498-ఏ ప్రకారం క్రూరత్వం కిందికే వస్తుందని పేర్కొంది. బిడ్డను తల్లికి దూరం చేసి.. మానసిక క్షోభకు గురిచేశారని వ్యాఖ్యానించింది. ‘అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతి రోజూ మానసికంగా వేధించారు.. ఇది చాలా దారుణం.. తీవ్రమైంది కూడా’ అని ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, అత్తింటివారి పిటిషన్‌ను తిరస్కరించింది.
ఇక, బాధితురాలు తన భర్త ఆచూకీ తెలియకుండా అత్తమామలు సహకరించారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.. ‘కింది న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ధిక్కరించారు.. భర్త వద్ద కుమార్తె ఉన్నప్పటికీ అతడి ఆచూకీ తెలియకుండా చేశారు.. అత్తింటివాళ్లు భర్తకు సహకరించారని మేము ఇప్పటికే నమోదు చేశాం’ అని కోర్టు పేర్కొంది.