ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడం లక్ష్యంగా సంస్కరణలు అమలుకావాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. సంస్కరణలు ఇప్పుడు అమలుచేయలేకపోతే రాబోయే పదేళ్లలో విద్యావ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ఉపాధ్యాయ సంఘాలతో ఆయన మొదటి సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్యలోనే అనేక అంశాలపై దాదాపు నాలుగు గంటలపాటు వారితో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో ఉన్నట్టుగా తమకు ఎలాంటి పరదాలు ఉండవని, సీఎం నుంచి ఎమ్మెల్యే వరకూ అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. సంస్కరణల అమలులో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు. అపార్ ఐడీల రూపకల్పనలో ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించామని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోందని, డ్రాపౌట్లు కూడా పెరుగుతున్నారని ఈ నేపథ్యంలో సంస్కరణలు అమలుచేయక తప్పదని స్పష్టం చేశారు. ఫలితాల విషయంలో ప్రైవేటు పాఠశాలలో పోటీపడాలని నిర్దేశించారు.