సాగునీటి సంఘాల ఎన్నికలకు వేళైంది. ప్రకాశం జిల్లాలోని 342 సంఘాల(డబ్ల్యూ యూఏల) ఎన్నికలు శనివారం జరగనున్నాయి. మొత్తం ఆయా సంఘాల పరిధిలోని 2.05 లక్షల మంది ఓటర్లు నీటిసంఘాల ప్రాదేశిక నియోజకవర్గ(టీసీ) సభ్యులను ఎన్నుకుంటారు. సదరు టీసీలు సమావేశమై డబ్ల్యూయూఏ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకునేలా షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఐదేళ్ల పదవీ కాలం ఉండే డబ్ల్యూయూఏల పరిధిలోనే నీటి వనరుల నిర్వహణ, మరమ్మతులు, ఇతరత్రా అన్ని పనులు ఉంటాయి. గత టీడీపీ హయాంలో 2015లో ఈ ఎన్నికలు జరగ్గా గడువు పూర్తికి ముందే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దుచేసి అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించింది.
నీటి వనరుల పర్యవేక్షణను గాలికొదిలేసింది. కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి సాగునీటి సంఘాల ఎన్నికలపై దృష్టి సారించింది. సెప్టెంబరులోనే షెడ్యూల్ ఇచ్చినా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు శనివారం జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మేజర్, మీడియం, మైనర్ విభాగాల వారీ డబ్ల్యూయూఏలను విభజించి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలో 342 సంఘాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. మేజర్(ఎన్నెస్పీ) నీటి విభాగంలో 88 డబ్ల్యూయూఏలు, మీడియం విభాగంలో 14, మైనర్ విభాగంలో 240 సంఘాలు ఉన్నాయి. మీడియం, మేజర్ సంఘాల పరిధిలో ఒక్కో దానిలో 12 టీసీలు, మైనర్ సంఘాల పరిధిలో ఒక్కో దానిలో ఆరు టీసీలు ఉన్నాయి. అలా అన్ని సంఘాలు కలిపి 2,651 టీసీలు ఉన్నాయి. ఆయా సంఘాల పరిఽధిలో తొలుత టీసీ సభ్యులను ఓటర్లుగా ఉండేవారు సమావేశమై చైర్మన్, వైస్‌చైర్మన్‌లను ఎన్నుకుంటారు. ఆయా విభాగాల పరిధిలో మొత్తం 2,05,768 ఆయకట్టు రైతులు ఓటర్లుగా ఉన్నారు. వారిలో మేజర్ విభాగంలోని ఎన్నెస్పీ పరిధిలో 1,16,421 మంది, మైనర్ ఇరిగేషన్‌లో 75 వేలు, మీడియం విభాగంలో మరో 35 వేల మంది ఉన్నారు. అలాగే మొత్తం ఓటర్లలో మహిళలు 61వేల మందికిపైగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నిర్వహణకు మొత్తం 3,068 మంది వివిధ స్థాయిల్లోని సిబ్బందిని వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒక్కో డబ్ల్యూయూఏకి ఒక ఎన్నికల అధికారి, మరొక అసిస్టెంట్ ఎన్నికల అధికారి, మూడు టీసీలకు ఒక పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ఖర్చుల కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.20లక్షలు మంజూరు చేసింది.