ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జమిలీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ అమల్లోకి వచ్చినా ఎన్నికలు మాత్రం 2029లో జరుగుతాయన్నారు. చంద్రబాబు అమరావతిలో చిట్‌చాట్‌గా మాట్లాడారు.. జమిలీ ఎన్నికలపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని.. జమిలీపై అవగాహన లేక వైఎస్సార్‌సీపీ ఏదిపడితే అది మాట్లాడుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని.. ఆ పార్టీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్నారు.
ఆ పార్టీ చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047ను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. విజన్ 2020 సాకారమైన తీరును నేటి యువత తెలుసుకోవాలన్నారు. 1996 నాటి పరిస్థితుల్ని 2020 నాటి పరిస్థితుల్ని బేరీజు వేసుకోవాలని సూచించారు.. 2047లో కూడా ఇదే పునావృతం అవుతుందన్నారు. రేపటి తరం భవిష్యత్ కోసం స్వర్ణాంధ్ర విజన్-2047ను తీసుకొచ్చామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలు ప్రకటించారు. పేదరికం లేని సమాజం, ఉపాధి ఉద్యోగ కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, సాగులో అధునాతన సాంకేతికత, ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ ఇంధన వనరుల వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛాంధ్ర, అన్ని రంగాల్లో విస్తృత సాంకేతికత (డీప్‌టెక్) అంటూ పది సూత్రాలు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలుస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వర్ణాంధ్ర- 2047 సాకారంతో ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మారతాయని.. పాతికేళ్ల ముందు సైబరాబాద్ ప్రాంతంలో అందరికీ రాళ్లు, గుట్టలు కన్పిస్తే.. తాను సింగపూర్, దుబాయ్, న్యూయార్క్ లాంటి మహానగరాల్ని చూశాననన్నారు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తును మార్చేదే విజన్ డాక్యుమెంట్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే లక్ష్యంమని.. అందుకే స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్ తెచ్చి దేశానికి, రాష్ట్రానికి అంకితం చేస్తున్నామన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగంగా 17 లక్షల మంది ఆన్‌లైన్‌లో సలహాలు, సూచనలు తెలియజేశారని.. 1.18 కోట్ల కుటుంబాల నుంచి అభిప్రాయాలను తీసుకున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ తరఫున ప్రధాని మోదీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తాము కలిసి పోటీ చేశామన్నారు.. ఎన్నికల్లో ప్రజలు అపూర్వ మద్దతు పలికారన్నారు. 2024 ఎన్నికల్లో ఓటు చీలడానికి వీల్లేదని.. కలిసి పనిచేస్తామని పవన్ ముందుకు నడిపించారని ప్రశంసించారు. 2014, 2024 ఎన్నికల్లో ఆయన తనకేం వస్తుందని కాకుండా.. రాష్ట్రానికి జరిగే మేలును ఆలోచించి గొప్ప నిర్ణయాలు తీసుకుని సహకరించారన్నారు.. అలాంటి మంచి మిత్రుడు ఉండటం చాలా సంతోషమన్నారు. విజన్ డాక్యుమెంట్‌పై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని చంద్రబాబు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa