ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల వల,,,అలర్ట్‌గా సైబర్ నేరాన్ని అడ్డుకున్న బ్యాంక్ సిబ్బంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 06:55 PM

విజయవాడలో ఓ సైబర్ నేరం జరగకుండా బ్యాంక్ ఉద్యోగులు అడ్డుకున్నారు. తెలివిగా వ్యవహరించి ఓ రిటైర్డ్ ఉద్యోగిని సైబర్ వల నుంచి బయటపడేశారు. నగరంలో పటమటకు చెందిన రిటైర్డ్ ఉద్యోగికి వారం క్రితం కర్ణాటక పోలీస్‌శాఖ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. 'మీ పేరు మీద ఉన్న కారు బెంగళూరులో రోడ్డు ప్రమాదానికి కారణమైందని.. ప్రభుత్వ ఆస్తులు, ప్రజలకు నష్టం వాటిల్లింది' అంటూ భయపెట్టారు. తనకు ఆ కారుకు ఎలాంటి సంబంధం లేదనేసరికి వెంటనే మాట మార్చారు. తనకు హిందీ అర్థం కాలేదని చెప్పడంతో.. తెలుగు మాట్లాడే మరో వ్యక్తి ఆయనతో మాట్లాడాడు. తాను ఎస్పీ అని పరిచయం చేసుకుని మాటలు కలిపాడు.


 ‘మీకో విషయం చెబుతా.. ఎవరికీ చెప్పొద్దు. తలుపులు వేసి గడియ పెట్టండి. ఈ విషయం బయటకు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది’ అని ఆ ఎస్పీ అని చెబుతున్న వ్యక్తి రిటైర్డ్ ఉద్యోగితో అన్నారు. వెంటనే ఆయన తలుపునకు గడియ పెట్టి వచ్చాడు. ఢిల్లీలో మానవ అక్రమ రవాణా కేసును పోలీసులు పట్టుకున్నారని.. సదకత్‌ఖాన్‌ అనే ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు ఎస్పీ అని చెబుతున్న వ్యక్తి వివరించాడు. అక్కడ 187 ఏటీఎం కార్డులు దొరికాయని.. వాటిలో కెనరా బ్యాంకు ఏటీఎం కార్డు మీ (రిటైర్డ్ ఉద్యోగి) పేరుతో ఉందన్నాడు. దీని ద్వారా ఏకంగా రూ. 3 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని చెప్పాడు. ఈ గ్యాంగ్ ఉద్యోగం పేరుతో 287 మంది మహిళలను కంబోడియా, మయన్మార్, ఫిలిఫ్పీన్స్‌ వంటి దేశాలకు పంపి వారితో డ్రగ్స్ అమ్మించడం, వ్యభిచారం చేయిస్తున్నారని వివరించాడు.


ఈ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు సహకారం అందించాలని.. ఆ వివరాలు రహస్యంగా సేకరించి, ఇద్దరం కలిసి మంచి పని చేద్దామన్ని రిటైర్డ్ ఉద్యోగితో చెప్పాడు. 'మీరు దీని కోసం ఢిల్లి వచ్చి స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని.. అంత ఖర్చు మీరు పెట్టుకోకుండా దిల్లీ రాకుండా ఉండేలా చేస్తానని హామీ ఇచ్చాడు. దీనికి ముందు మీకు ఈ ముఠాతో ఎలాంటి సంబంధాలు లేవని నిరూపించుకోవాలన్నాడు. దీని నిమిత్తం రూ.3 కోట్లు ఉన్న మీ ఖాతాను ఆడిట్‌ చేయించాలని సూచించారు. ఆడిట్‌కు రూ.3 లక్షలు అవుతుందని, తర్వాత డబ్బులు మీకు తిరిగి వచ్చేస్తాయని'చెప్పాడు. ఇదంతా నిజమేనని నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి.. ఓ ఫైనాన్స్‌ కంపెనీ దగ్గర రూ.3.99 లక్షలు అప్పు తీసుకున్నాడు.


రిటైర్డ్ ఉద్యోగి విజయవాడలోని ప్రజాశక్తినగర్‌లోని ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లారు. రూ.3లక్షలు ఇచ్చి అహ్మద్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు ఆర్టీజీఎస్‌ ద్వారా బదిలీ చేయమని సిబ్బందిని కోరారు. డబ్బులు జమ చేయమని చెప్పిన అకౌంట్ అసోంలోని చమటాలో ప్రైవేటు బ్యాంకుది కావడంతో బ్యాంకులో అకౌంటెంట్‌ పిచ్చయ్యకు అనుమానం వచ్చింది.. వెంటనే ఆయన సైబర్‌ క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ వృద్ధుడిని అడిగి వివరాలు సేకరించగా.. ఇది సైబర్‌నేరగాళ్ల మోసమని చెప్పి, భయపడవద్దని సూచించారు. అయితే సైబర్ నేరం జరగకుండా అప్రమత్తమై అడ్డుకున్న బ్యాంక్ మేనేజర్‌ రామేశ్వర్, అకౌంటెంట్‌ పిచ్చయ్యలను విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa