బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. మొదటి రోజు మాదిరిగానే మూడో రోజు కూడా వరుణుడు ఆటంకం కలిగించడంతో ఎక్కువ ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ఇక మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. భారత జట్టు 44 పరుగులకే నాలుగు కీలక వికెట్లు పారేసుకోవడం గమనార్హం. యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (3), రిషభ్ పంత్ (9) ఇలా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టగా.. కమిన్స్, హేజిల్‌వుడ్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు ఆతిథ్య జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101), అలెక్స్ కేరీ (70) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు పడగొట్టాడు. అలాగే సిరాజ్ 2 వికెట్లు తీయగా... ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ సాధించారు. ఇక మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 51/4 (17 ఓవర్లు). క్రీజులో కేఎల్ రాహుల్ (33), రోహిత్ శర్మ (0) ఉన్నారు. ఆసీస్ కంటే టీమిండియా ఇంకా 394 రన్స్ వెనుకబడి ఉంది.