బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 6 వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టుని 445 పరుగుల భారీ స్కోరుకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 28 ఓవర్లు వేసిన బుమ్రా 76 పరుగులు మాత్రమే ఇచ్చి ముఖ్యమైన వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు తేలిపోగా ఆస్ట్రేలియా బ్యాటర్లను భయపెట్టిన ఏకైక భారత బౌలర్‌గా అతడు నిలిచాడు.కాగా, తొలి ఇన్నింగ్స్ తీసిన 6 వికెట్లతో బుమ్రా తన టెస్ట్ కెరీర్‌లో ఏకంగా 12వ సారి ఐదు వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన ఆసియా/భారత్ ఆటగాడిగా బుమ్రా చరిత్ర సృష్టించాడు. కేవలం 10 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును సాధించాడు. అంతకుముందు, భారత్‌కే చెందిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ 11 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.ఆస్ట్రేలియా గడ్డపై 10 మ్యాచ్‌ల్లోనే 50 వికెట్లు సాధించిన ఆసియాయేతర ప్లేయర్లలో లాన్స్ గిబ్స్, సిడ్నీ బార్నెస్, హెరాల్డ్ లార్వుడ్, టామ్ రిచర్డ్‌సన్ వంటి దిగ్గజ బౌలర్లు ఉన్నారు. వీరి సరసన తాజాగా బుమ్రా చేరాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై వేగంగా 50 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మారిస్ టేట్ అగ్రస్థానంలో ఉన్నాడు. కేవలం 8 మ్యాచ్‌ల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు