ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఏపీలో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 12:21 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో 57 పోస్టులకు గానూ.. పార్వతీపురం రెవెన్యూ డివిజన్ 36, పాలకొండ రెవెన్యూ డివిజన్ 21 రేషన్ డీలర్ల నియామకం, దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు దాఖలకు డిసెంబర్ 18 ఆఖరు తేదీగా నిర్ణయించారు. అన్నమయ్య జిల్లాలో మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో 119 రేషన్ డీలర్ల నియామకం, దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు దాఖలకు డిసెంబర్ 21 ఆఖరు తేదీగా నిర్ణయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది. విద్యార్హత.. వయో పరిమితి రేషన్ డీలర్లు, కొత్తగా మంజూరైన దుకాణాల భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్‌ను విద్యార్హతగా నిర్ణయించారు. వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్డ్వ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిర్ణయించిన మినహాయింపు ఉంటుంది. డీలర్ పోస్టుకు, దుకాణానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు అదే గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఎటువంటి పోలీసు కేసులు ఉండకూడదు. చదువుతున్నవారు, విద్యా వలంటీర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్నవారు, ఆశ కార్యక్తలు దరఖాస్తు దాఖలకు అనర్హులు. ఆర్థిక స్థోమత వివరాలు తెలుపుతూ.. స్వీయ డిక్లరేషన్‌, సర్టిఫికేట్ సమర్పించాలి. దరఖాస్తుదారుల కుంటుబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులై ఉండొద్దు. ఎంపిక షెడ్యూల్.. 1. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 36 రేషన్ డిపోలను భర్తీ చేస్తున్నామని సబ్ కలెర్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 18 సాయంత్రం 5 గంటలలోగా పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం, సంబంధిత తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. డిసెంబర్ 19న దరఖాస్తుల పరిశీలన చేస్తామని, డిసెంబర్ 21న హాల్ టిక్కెట్లు జారీ చేస్తామని చెప్పారు. డిసెంబర్ 23న పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రాత పరీక్ష ఉంటుందన్నారు. డిసెంబర్ 26 రాత పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని, డిసెంబర్ 28న సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉంటుందని వివరించారు. డిసెంబర్ 30న తుది ఫలితాలు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 2. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో 21 రేషన్ డీలర్ల పోస్టులలో భామిని మండలంలో 5, జియ్యమ్మవలస మండలంలో 3, కురుపాం మండలంలో 1, పాలకొండ మండలంలో 5, వీరఘట్టం మండలంలో 7 రేషన్ డీలర్ల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 18 సాయంత్రం 5 గంటల లోగా పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం, సంబంధిత తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. డిసెంబర్ 19న దరఖాస్తుల పరిశీలన చేస్తామని, డిసెంబర్ 21న హాల్ టిక్కెట్లు జారీ చేస్తామని తెలిపారు. డిసెంబర్ 23న పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాత పరీక్ష ఉంటుందన్నారు. డిసెంబర్ 26 రాత పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని, డిసెంబర్ 28న సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 30న తుది ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. 3. అన్నమయ్య జిల్లాలో మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో 119 రేషన్ డిపోల్లో డీలర్లను భర్తీచేస్తున్నామని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ తెలిపారు. ఇందులో పాత రేషన్ డిపోలు 74, కొత్త విభజిత రేషన్ డిపోలు 45 ఉన్నాయని వివరించారు. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 21 సాయంత్రం 5 గంటల లోగా సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. డిసెంబర్ 22న దరఖాస్తుల పరిశీలన చేస్తామని, డిసెంబర్ 24న హాల్ టిక్కెట్లు జారీ చేస్తామని తెలిపారు. డిసెంబర్ 28న రాత పరీక్ష ఉంటుందన్నారు. డిసెంబర్ 29 రాత పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని, డిసెంబర్ 30, 31 తేదీల్లో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉంటుందని.. జనవరి 2న తుది ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూకు వేర్వేరుగా మార్కులు ఉంటాయి. మొత్తం 100 మర్కులు ఉండగా, అందులో రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష నుంచి ఇంటర్వ్యూకు 1:15 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. జత చేయాల్సిన పత్రాలు 1. ఇంటర్మీడియట్‌, పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్లు 2,. వయస్సు ధ్రువీకరణ పత్రం 3. నివాస ధ్రువీకరణ పత్రం (ఓటరు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా పర్వాలేదు) 4. మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు 5. కుల ధ్రువీకరణ పత్రం 6. నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధ్రువీకరణ పత్రం 7.దివ్యాంగుల కేటగిరికి చెందిన వారైతే.. సంబంధిత సర్టిఫికెట్లు జత చేయాలి. దరఖాస్తు ఇలా..ఆయా రెవెన్యూ డివిజన్‌లలో డీలర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆర్డీవో కార్యాలయం, తహశీల్దారు కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు, గ్రామ సచివాలయం నోటీసు బోర్డు, రేషన్ షాపుల వద్ద ప్రచురిస్తారు. పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తులను ఆయా మండలాల తహశీల్దారు కార్యాలయాలం, ఆర్డీవో కార్యాలయం నుంచి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్‌ను నేరుగా గాని, లేదా పోస్టు ద్వారా గాని పంపవచ్చు. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు జత చేయడం తప్పని సరి. ఇతర వివరాల కోసం తహశీల్దారు కార్యాలయంలో సంప్రదించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com